Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 365

వికీసోర్స్ నుండి


రేకు: 0365-01 హిందోళం సం: 04-381 వైరాగ్య చింత

పల్లవి:

కరుణించవే నిజగతి బోధించవే
హరి నిన్ను గొలువక యలసీఁ బ్రాణి

చ. 1:

కలలో నింతులఁ గలసినట్లనే
వెలిఁ గాంతలతోడి వేడుకలు
లలి నిందుకుఁగా లంపటములఁబడి
పలుమారు నూరక బడలీఁ బ్రాణి

చ. 2:

నిన్నటి యాహార నిజరుచివలెనే
అన్నువ నిప్పటి యాహారము
యెన్న నిందుకే యిడుమలఁ బొరలుచు
కన్న గతులఁ గడుఁ గలఁగీఁ బ్రాణి

చ. 3:

పరుసముసోఁకినబంగారమువలె
పరమభాగవతపట్టములు
అరయఁగ శ్రీ వేంకటాధిప నీకృప
యిరవుగఁ గని తుదకెక్కీఁబ్రాణి


రేకు: 0365-02 మంగళకౌశిక సం: 04-382 శరణాగతి

పల్లవి:

ముట్టితేనే మూయైఁ బట్టితేనే పంతమయీ
ఇట్టె మమ్ముఁగావవే యిందిరారమణ

చ. 1:

తీరుగాఁ బుణ్యముసేసితే జన్మబంధమై
తోరపు నాపాపములైతే దుఃఖమైని
వూరకుంటే నీప్రపంచ ముల్లంఘించినట్లై
యేరీతి నడచువార మిందిరారమణ

చ. 2:

అంకె దయఁ దలఁచితే నన్నిటికిఁ దగులై
కొంకక కోపంచితేనే క్రూరమ్మైని
మంకున నూరకవుంటే మదోన్మత్తుఁడై
యింకనేమి సేయువార మిందిరారమణ

చ. 3:

యిన్ని చిక్కులునేల యిట్టె శ్రీ వేంకటేశ
మిన్నక నీశరణంటే మేలైని
వెన్నెల నీయర్థమే వేదశాస్త్రసమ్మతై
యెన్న నీవే సేయువాఁడ విందిరారమణ


రేకు: 0365-03 శంకరాభరణం సం: 04-383 వైరాగ్య చింత

పల్లవి:

ఎప్పు డేబుద్ది వుట్టునో యెరఁగరాదు
దెప్పరపు మా బ్రదుకు దేవునికే సెలవు

చ. 1:

యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక -
నేడకు బోయెదమో యిటమీఁదను
వీడని మాయంతరాత్మ విష్ణుఁడు మా -
జాడ జన్మమతనికే సమర్పణము

చ. 2:

గతచన్న పితరు లక్కడ నెవ్వరో
హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో
మతి మాజీవనమెల్ల మాధవుఁడు
అతనికే మాభోగాలన్నియు సమర్పణము

చ. 3:

తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ -
నడచే ప్రపంచము నాకేడదో
కడఁగి శ్రీ వేంకటేశు గతియే మాది
అడఁగు మా పుణ్యపాపా లతని కర్పణము


రేకు: 0365-04 మలహరి సం: 04-384 నామ సంకీర్తన

పల్లవి:

ఇదియే సాధనమిహపరములకును
పదిలము మాపాలి పరమవునామం

చ. 1:

కలి దోష హరము కైవల్యకరము
అలరిన మా శ్రీ హరి నామం
సులభము సౌఖ్యము శోభన తిలకము
పలుమారును శ్రీ పతి నామం

చ. 2:

పాప నాశనము బంధ విమోక్షము
పైపై నిది భూపతి నామం
స్థాపితధన మిది సర్వరక్షకము
దాఁపి రమిది మాధవ నామం

చ. 3:

నేమము దీమము నిత్యకర్మమిది
దోమటి గోవిందుని నామం
హేమము శరణము యిన్నిట మాకును
యే మేర శ్రీ వేంకటేశ్వరు నామం


రేకు: 0365-05 పాడి సం: 04-385 వైష్ణవ భక్తి

పల్లవి:

నమ్మిన దిదివో నాపితురార్జిత
మిమ్మహిఁ జూడరో యిది మీదిగాదు

చ. 1:

నలినదళాక్షుని నామాంకితమే
నిలువున బాఁతిన నిధానము
కలకాలమిదే గాదెల కొలుచులు
నలుగడ నివియే నాలుక రుచులు

చ. 2:

శ్రీ పతి రూపమే చింతించు తలఁపే
పై పై మాయింటి భాగ్యములు
పూఁపలమిత్రులుఁబుత్రాదు లిది
వైపగు మాకిదె వ్యవసాయములు

చ. 3:

శ్రీ వేంకటపతి సేవిది యొకటే
భావించు నాయుష్యభౌష్యములు
కైవల్యపద మిదె కాయజసుఖమిదె
సావధానముల సంసార మిది


రేకు: 0365-06 భైరవి సం: 04-386 వేంకటగానం

పల్లవి:

సందడి సొమ్ముల తోడి సాకారమిదె వీఁడె
యిందరు వర్ణించరే యీ రూపము

చ. 1:

చుక్కలతో నాకాశము సూటై నిలువఁబోలు
నిక్కి రత్నాలజలధినీటు గాఁబోలు
మిక్కిలి నానావర్ణ మేఘపంక్తి గాఁబోలు
యిక్కడనే నిలుచున్న దీరూపము

చ. 2:

నించిన పంచవన్నెల నీలగిరి గాఁబోలు
అంచల సంధ్యాకాల మది గాఁబోలు
చించ కాతని మెరుఁగుల చీఁకటిది గాఁబోలు
యెంచఁగ నలవిగాదు యీ రూపము

చ. 3:

పున్నమ సమాసయు పోగై నిలువఁబోలు
వున్నతి యోగీంద్రుల యూహ గాఁబోలు
పన్నిన బ్రహ్మాండాల భరణిది గాఁబోలు
యిన్నిట శ్రీ వేంకటేశు యీ రూపము