శ్రీయుక్తేశ్వర్ గిరి
స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి | |
---|---|
జననం | ప్రియానాథ్ కరార్ 1855 మే 10 సీరాంపూర్, బెంగాల్ ప్రావిన్సు |
నిర్యాణము | 1936 మార్చి 9 పూరీ, ఒరిస్సా | (వయసు 80)
గురువు | లాహిరి మహాశయులు |
తత్వం | క్రియా యోగ |
సాహిత్య రచనలు | The Holy Science |
ప్రముఖ శిష్యు(లు)డు | సత్యానంద గిరి పరమహంస యోగానంద |
శ్రీయుక్తేశ్వర్ గిరి (మే 10, 1855 – మార్చి 9, 1936) ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.[1] ఈయన ఒక యోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానందకు గురువు. ఈయనకు గురువు లాహిరి మహాశయులు.
జీవితం
[మార్చు]యుక్తేశ్వర్ జన్మనామం ప్రియానాథ్ కరార్. మే 10, 1855లో బెంగాల్ ప్రావిన్సు లోని సీరాంపూర్ లో క్షేత్రనాథ్ కరార్, కాదంబిని దంపతులకు జన్మించాడు. ఈయన చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు, భూమి తాలూకు వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.[2] చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఈయన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సంపాదించి శ్రీరాంపూర్ క్రిస్టియన్ మిషనరీ కళాశాలలో సీటు సంపాదించాడు. అక్కడ ఉండగానే బైబిల్ పై ఆసక్తి కలిగింది.[3] ఈ ఆసక్తి వల్ల ఈయన తర్వాత రాసిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో యోగా, బైబిల్ ను సమన్వయం చేస్తూ కొంత శాస్త్రీయమైన వివరణలు ఇచ్చాడు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కలకత్తా వైద్య కళాశాలలో రెండు సంవత్సరాల పాటు చదివాడు.[3]
కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకు వివాహమై ఒక కూతురు జన్మించింది. తర్వాత కొన్నేళ్ళకు భార్య మరణించింది.[4] తర్వాత కొన్నేళ్ళకు ఈయన శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించాడు.[5]
1884లో లాహిరి మహాశయులు ఈయనకు క్రియాయోగ దీక్షనిచ్చి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు.[6] తర్వాత తరచుగా బెనారస్ లో తన గురువును కలుస్తూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. 1894లో ఈయన అలహాబాదులో కుంభమేళా జరుగుతున్న సమయంలో తన పరమ గురువైన (లాహిరీ మహాశయుల గురువు) మహావతార్ బాబాజీని కలుసుకున్నాడు.[6] బాబాజీ ఈయనను హిందూ పురాణాలను, బైబిల్ ను సమన్వయం చేస్తూ పుస్తకాలు రాయమని ప్రేరేపించాడు.[7] స్వామి అనే పేరును కూడా ఆయనే చేర్చాడు.[8] శ్రీ యుక్తేశ్వర్ ఈ పుస్తకాన్ని 1894 లో కైవల్య దర్శనం (ది హోలీ సైన్స్) అనే పేరుతో విడుదల చేశాడు.[9]
ఈయన ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవాడు. సంస్కృతంలో కూడా మంచి పరిజ్ఞానముండేది. ఆంగ్లం, సంస్కృత భాషలను సులభంగా నేర్చుకోవడానికి తాను స్వయంగా రూపొందించిన బోధనా పద్ధతులను విద్యార్థులకు వివరించేవాడు.
మూలాలు
[మార్చు]- ↑ Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi, 1997 Anniversary Edition p. 383. Self-Realization Fellowship (Founded by Yogananda) http://www.yogananda-srf.org/, Chapter 35, p.383.
- ↑ Satyananda, p. 11
- ↑ 3.0 3.1 Satyananda, p. 12.
- ↑ Satyananda, pp. 12, 14.
- ↑ Satyananda, p. 38.
- ↑ 6.0 6.1 Yogananda, p. 324.
- ↑ Yogananda, p. 327.
- ↑ Satyananda, p. 24.
- ↑ Sri Yukteswar, introduction.
మూల గ్రంథాలు
[మార్చు]- Frawley, David (2000). Astrology of the Seers. Lotus Press. ISBN 978-0-914955-89-4.
- Satyananada, Swami (2004). Swami Sri Yukteshvar Giri Maharaj: A Biography. Yoga Niketan. Translated from Bengali edition, copyright Yoga Niketan
- Sri Yukteswar Giri, Swami (1990). The Holy Science. Self-Realization Fellowship.
- Yogananda, Paramahansa (1997). Autobiography of a Yogi. Self-Realization Fellowship (Founded by Yogananda) /. ISBN 0-87612-086-9. 1997 Anniversary Edition.