మల్లాది వేంకట కృష్ణశర్మ
మల్లాది వేంకట కృష్ణశర్మ నాటక రచయిత.
బాల్యం
[మార్చు]మల్లాది వేంకట కృష్ణశర్మగారు 1907 లో శ్రీకాకుళం లో జన్మించారు.
సినిమా రంగ ప్రవేశం
[మార్చు]సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్ నిర్మించిన 'పరదేశి' (1953). అంజలి పిక్చర్స్‌వారు పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. మంచి టెక్నీషియన్లతో మంచి సినిమా తియ్యాలని ఆలోచించి, హిందీలో వచ్చిన 'రాజా రాణి'ని కొన్నారు. దాన్ని డైరక్ట్ చెయ్యడానికి దర్శకుడిగా పేరు పొందిన ఎల్.వి.ప్రసాద్‌గారిని నియమించుకున్నారు. రెండు భాషల చిత్రం. 'రాజా - రాణి'ని తెలుగుకు వీలయ్యేలాగా రాసుకోవాలి. ప్రత్యేకంగా ఒక రచయితని పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందని, ఎవరనీ ఆలోచించారు. కృష్ణశర్మగారు రాసిన నాటకాల్లో అంతకుముందు అంజలిదేవిగారు, అంజనీకుమారి పేరుతో నటించారు. గనక, ఆ నాటకాలకి పేరూ వచ్చింది గనక, కృష్ణశర్మగారిని రచయితగా ఎన్నుకున్నారు. అలా జరిగింది- మల్లాది వెంకట కృష్ణశర్మగారి సినిమా రంగప్రవేశం.
నాటక రచయితగా
[మార్చు]కృష్ణశర్మగారిది పండిత వంశం. అందరూ సంస్కృతాంధ్రాల్లో గట్టివాళ్లు. కావ్యాలు, ప్రబంధాలూ క్షుణ్ణంగా అభ్యసించి, నాటక రచనలు చేసినవారు. ముఖ్యంగా శర్మగారి అన్నయ్య విశ్వనాథ కవిరాజు గారు హాస్యప్రియులు. పద్య నాటకాలు చాలా రాశారు. ప్రహసనాలు, నాటకాలూ సరేసరి! తన 15వ ఏటనే ఆయన 'లాక్షాగృహం' అనే ఏకాంకిక రాశారు. శ్రీకాకుళంలో తెలుగు ఉపాధ్యాయుడిగా తన 23వ ఏటనే ఉద్యోగంలో చేరారు. సురభి వారి నాటకాలు చూసి, చూసి వారితో పరిచయం ఏర్పరచుకుని- వారికి కొన్ని ప్రామాణిక నాటకాలు రాసి ఇచ్చారు. నాటకరంగం మీద ఎనలేని అనుభవంతో- పోలాని అనే గ్రామంలో నాటక కళాపరిషత్తు నడిపారు. శ్రీకాకుళంలో చట్టి పూర్ణయ్య పంతులు గారుండేవారు. ఆయన ప్రసిద్ధి రంగస్థల నటుడు. గిరీశం పాత్రని గొప్పగా అభినయించేశారని చెప్పుకోడం విన్నాను. ఆయన, విశ్వనాథ కవిరాజుగారూ కలిసి, ఆ పరిషత్తు నడిపారు. ఆంధ్రనాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుల్లో కవిరాజు గారొకరు. ఆయన రాసిన హాస్య నాటకాలు ఎన్నో దొంగాటకం, డొంకలో షరాబు, గ్రీన్‌రూమ్, కిర్రు గానుగ వంటి నాటికలు బాగా ప్రదర్శితమయ్యేవి. ఐతే, ఆయన పూర్తిపేరు మల్లాది విశ్వనాథ శర్మ. 'కవిరాజు' బిరుదు. ఆ బిరుదునే పేరుగా వాడుకున్నారాయన. 1936లో సినిమా రంగంలో ప్రవేశించి, 'భక్త మార్కండేయ (1938)', 'మాలతీ మధనం' (1940), 'పంతులమ్మ' (1943) 'సౌదామిని' (1951) మొదలైన చిత్రాలకు రచన చేశారు. భరణివారు తీసిన 'చక్రపాణి'కి కథకుడు ఆయనే.
కవిరాజుగారి తమ్ముడు మల్లాది కృష్ణశర్మ గారు. కవిరాజుగారి పుత్రుడు మల్లాది అవధాని కూడా నాటకాలు, హాస్య నాటికలూ రాశారు. కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివి, కొంతకాలం కలెక్టరాఫీసులో గుమస్తా ఉద్యోగం చేసినా, నాటక రచనలు చేసి పేరు తెచ్చుకున్నారు. సురభివారు ప్రదర్శిస్తున్న మాయాబజార్, బాలనాగమ్మ, భూకైలాస్, దశావతారాలు, దక్షయజ్ఞం మొదలైన నాటకాలన్నీ శర్మగారి రచనలే! 'మిస్ ప్రేమ బి.ఎ.' నాటకం ఎంతో పేరు తెచ్చుకుంది. ఆంధ్రదేశంలోని చాలా పట్టణాల్లో ప్రదర్శితమైంది. వారసత్వం, ప్రత్యేక్ష దైవం, సుబ్బమ్మ విరహం, నామకరణం లాంటి హాస్య నాటికలు చాలా రశారాయన.
చిత్రసీమలో
[మార్చు]ఆర్.కె.రావు, శర్మగారూ మంచి స్నేహితులు. ఆ పరిచయం ఉండడం వల్ల, కృష్ణశర్మగారు 'పరదేశి'కి రాస్తున్నప్పుడు ఆయన దగ్గర (మద్రాసులో) రావి కొండలరావు సహాయకుడిగా చేరాడు. 'పరదేశి' సంభాషణలు ఆయన చెబుతూ వుంటే ఇతను రాసేవాడు . 'పరదేశి' తర్వాత, ఆయన 'అన్నదాత' (1953), 'బంగారు భూమి' (1954), 'వద్దంటే డబ్బు' (1954), 'బీదల ఆస్తి' (1955) మొదలైన చిత్రాలకు మాటలు, కొన్ని పాటలూ రాశారు. హెచ్.ఎం.రెడ్డిగారు తన చిత్రాలను ముగ్గురు నలుగురు రచయితల చేత రాయించేవారు, శ్రీశ్రీ, కె.గోపాలరాయశర్మ వంటివారు రాసేవారు. కృష్ణశర్మగారు కూడా రాసేవారు. కొన్ని చిత్రాలకి హాస్య సన్నివేశాలు కల్పించడం, మాటలు రాయడం కూడా చేసేవారాయన. కొంత కాలం రాజరాజేశ్వరి కంపెనీలో కూడా కథాచర్చల్లో పాల్గొనేవారు. తర్వాత అనారోగ్యరీత్యా మద్రాసు వదిలి, సొంత ఊరు వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి సినిమాలు కుదరలేదు. మళ్లీ సురభి నాటక సంస్థకు వెళ్లిపోయి, వాళ్లకి నాటకాలు రాసి ఇచ్చారు. శర్మగారు మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ రాసేవారు. కాని, విడిగా ఎవరూ చిత్రాల్లో పాటలు రాయించుకోలేదు.
చివరి దశ
[మార్చు]శ్రీకాకుళంలో ఉన్నప్పుడు అక్కడ తిమ్మరాజు శివరాజుగారి 'మహోదయ' వారపత్రికకి శర్మగారు చిన్న చిన్న రాజకీయ ప్రహసనాలు రాసి ఇచ్చేవారు. ప్రెస్‌లోనే కూర్చొని, అక్కడికక్కడే ఆ ప్రహసనాలు రాసేవారు. అరగంట, గంటలో రాసి ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. సినిమాలకు కూడా ఆయన దృశ్యాల్ని అంత తొందరగానూ రాసేవారు. హెచ్.ఎమ్. రెడ్డిగారి ఆఫీసులో కూర్చొని, పదిగంటలకి మొదలుపెట్టి, ఒంటిగంటకల్లా 32 సీన్లు రాశారు . ఐతే, మరి సినిమా రంగం ఎందుకు ఆయన్ని ఉపయోగించుకో లేకపోయిందో తెలియదు. తెల్లని ఖద్దరు జుబ్బా, పంచె కట్టుకుని వేళ్ల మధ్య సిగరెట్టు బిగించి, పొగ లాగుతూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ వుండే కృష్ణశర్మగారు సురభి సంస్థలోనే వుంటూ అక్కడే జనవరి 19, 1973 నాడు మృతిచెందారు.