Jump to content

భీమాసురుడు

వికీపీడియా నుండి
విరధుడిని సజీవంగా పాతిపెడుతున్న రామ లక్ష్మణులు

భీమాసురుడు కుంభకర్ణుడు, కర్కటి లకు జన్మించిన రాక్షసుడు.

కర్కటుడు అనే రాక్షసుడు, పుష్కసి అనే భార్యతో సహ్యాద్రి పర్వతాలలో నివసించేవాడు. వారికి కలిగిన కూతురు కర్కటి. ఆమెను విరాధుడు అనే వాడికిచ్చి పెళ్ళిచేశారు. విరాధుడు దండకారణ్యంలో శ్రీరాముని చేతిలో మరణించాడు. కర్కటి తల్లిదండ్రులతో సహ్యాద్రి పర్వతాలలో నివసించసాగింది. ఒకనాడు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడనే వాడు భీమానదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు కర్కటుడు, పుష్కసి అతన్ని పట్టుకొని మింగబోయారు. అతడు కోపించి తన శాపాగ్నిచేత వారిద్దరినీ భస్మం చేశాడు. కర్కటి అప్పటి నుండి దిక్కుతోచక ఒంటరిగా కాలం గడపసాగింది.

ఒకనాడు కుంభకర్ణుడు సహ్యాద్రి పర్వతాలకు వచ్చి కర్కటిని చూసి ఆమెను గాంధర్వవిధిలో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు కర్కటితో గడిపినందువలన వారికి కొడుకు పుట్టాడు. వాడు 'భీముడు' అనే పేరుతో పెరిగాడు. పెద్దవాడైన భీమునికి కర్కటి తన వృత్తాంతం వివరించగా అతడు కుపితుడై తన తండ్రినీ, బంధువులనూ చంపిన శ్రీరాముడు విష్ణువు అవతారం కావడం చేత విష్ణు భక్తులైన మహర్షులను హింసించడం, యాగాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. సహ్యాద్రి పర్వతాలలో బ్రహ్మను గూర్చి వేయి సంవత్సరాలపాటు గాఢమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరినవరాలిచ్చాడు.

వరగర్వంతో భీముడు దేవలోకంపై దండెత్తి దేవతలను ఓడించి, స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించాడు. దిక్పాలకులు దిగంతాలకు పారిపోయారు. తరువాత భీముడు మర్త్య లోకాన్ని జయించాలని బయలుదేరాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని గొప్ప శివభక్తుడైన సుదక్షిణుడు పాలిస్తున్నాడు. భీముడు మొదటగా కామరూప దేశంపై దండెత్తి, సుదక్షిణుడిని ఓడించి అతన్ని అతని భార్య అయిన దక్షిణను డాకినీ శిఖరానికి తెచ్చి చెరసాలలో బంధించాడు. సుదక్షిణుడు భార్యాసమేతంగా శివున్ని పూజిస్తూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నాడు. భీమాసురుడు సమస్త భూమండలాన్ని హస్తగతం చేసుకొని, వేదధర్మాలను విధ్వంసం చేస్తూ సకల భోగాలను అనుభవించసాగాడు. ఋషులూ, దేవతలూ వాడి బాధలు భరించలేక కైలాసానికి వెళ్ళి పార్వతీపరమేశ్వరులకు రక్షించమని కోరారు.

మంత్రులచేత సుదక్షిణుని శివభక్తిని గురించి తెలుసుకొన్న భీముడు శివున్ని దూషించడం, పరిహాసం చేశాడు. అయితే శివుడి గొప్పతనాన్ని చెప్పడం సహించని భీముడు శివలింగం మీదకు కత్తిని విసరుతాడు. తక్షణమే లింగం నుండి శివుడు ఆవిర్భచించాడు. భీమాసురుడిని శివుడిని భీకరమైన పోరు జరిగింది. భీముడు, వాడి అనుచరులూ నానారకాల శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తూ, శివుణ్ని దూషిస్తూ తిట్టసాగారు. కోపగించిన శివుడు రుద్రతాండవం చేస్తూ ఫాలనేత్రాన్ని తెరిచి భీమాసురుడిని భస్మం చేశాడు.

అలా లోకకంటకుడైన భీముణ్ణి చంపినచోట శివుడు భీమేశ్వరుడు అనే పేరుతో ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో వెలసి పూజలందుకుంటున్నాడు. ఇదే ప్రస్తుతం మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలలోని భీమ శంకరం.

మూలాలు

[మార్చు]
  • భీమాసురుడు, కలువకొలను సదానంద, సప్తగిరి మే 2006 సంచికలో ప్రచురించిన వ్యాసం.