Jump to content

నాగార్జునుడు

వికీపీడియా నుండి
నాగార్జున
షింగోన్ హసాజో అనే జపాన్ కు చెందిన షింగో బౌద్ధ వ్రాతప్రతులలో నాగార్జున చిత్రం.కామకూర కాలం (13-14 శతాబ్దం)
జననంసుమారు 150 CE
మరణంసుమారు 250 CE
భారతదేశం
వృత్తిబౌద్ధమతగురువు, సన్యాసి, తత్వవేత్త.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహాయన బౌద్ధంలోని మాధ్యమిక తత్వ స్థాపకుడు.

ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు) (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.

జీవితం

[మార్చు]

నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. చైనా, టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర అతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశానికి చెందిన వైదీక బ్రాహ్మణుడు[2][3]. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు[4].

నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు[5]. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు[6].

ఆంధ్ర దేశంతో అనుబంధం

[మార్చు]
అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం
నాగార్జున కొండ వద్ద (అనుపు) నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాలు

ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం (నాగార్జున కొండ) పై ఒక బౌద్ధ విద్యాలయమును/విహారం-(మహచైత్యవిహారం/పారావత విహారం) కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విహారంలో 5 అంతస్తులు,1500 గదులు కలవని చైనా యాత్రీకుడు-'ఫాహియన్'పేర్కొన్నాడు.ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.

నాగార్జునుని రచనలు

[మార్చు]
అనుపు వద్ద నాగార్జున విశ్వ విద్యాలయ శిథిలాలు

నాగార్జునుడు వ్రాసిన ముఖ్య గ్రంథాలు:

  1. మూలమాధ్యమికకారిక
  2. మహాప్రజ్ఞానపరమితశాస్త్ర
  3. ద్వాదశనికాయశాస్త్ర
  4. దశభూమివిభాసశాస్త్ర
  5. శూన్యతాసప్తతి
  6. యుక్తిసస్తిక
  7. విగ్రహ వ్యావర్తని
  8. సుహ్రిల్లేఖ
  9. రత్నావళి

వీటిలో 1, 7 మూల సంస్కృతములో దొరికాయి. 2, 3 చైనీస్ అనువాదాలుగా లభించాయి. 2, 3 తప్ప మిగిలినవన్నీ టిబెటన్ అనువాదాలుగా ఉన్నాయి. నాగార్జునుడు తొలుత సంస్కృతము, పిదప పాళీ భాషలలో వ్రాశాడు. రచనలలో నికాయ సిద్ధాంత ప్రభావము గలదు.

విగ్రహ వ్యావర్తిని

ఆచార్య నాగార్జునుడు చెప్పిన శున్యవాదానికి మాధ్యమికవాదం అన్నపేరు ప్రశస్తిలోనికి వచ్చినా, దీనికి అద్వయవాదమని, సర్వధర్మశున్యవాదమని, ప్రతీత్య సముత్సాద వాదమని పేర్లు ఉన్నాయి.అయితే మాధ్యమికవాదం అన్నపేరు దీనికి మిగిలిపోవడానికి ఒక కారణం ఉంది.శాక్యపుత్రీయుని ఆది బౌద్ధంలో బహుతెగలు ఉన్నట్లే, ఆ అనంతరం వచ్చిన శూన్యవాదంలో కూడా తెగలు ఏర్పడ్డాయి.ఇందులో మొదటి తెగ పుద్గలశూన్యవాదం (Pluratism), ఇందులో మరిరెండు శాఖలు ఏర్పడ్డాయి. ఈ ఉపశాఖలలో అతివాదులను సర్వాస్తివాదులని, మితవాదశాఖని వాత్సీపుత్రీయులనీ అంటారు.ఆ తర్వాత సర్వధర్మ శూన్యతావాదం బయలుదేరింది. ఇందులో మరలా రెండు శాఖలు.ప్రాసంగికులు;స్వాతంత్ర్యికులు అని. ఇందులో నాగార్జునాచార్యులవారు ప్రాసంగిక శాఖకు చెందినవారు. భావ్యాధి ఇతర తాత్వికులు స్వాతంత్ర్యికులు. ఈ రెండు శాఖలను కలిపి మాధ్యమిక శాఖ అంటారు. నాగార్జునుని తరువాత వేరెవ్వరూ కొంతకాలం ఈ శూన్యవాదాన్ని వ్యాప్తిలోకి తేలేకపోయారు, అటుపై ఇద్దరు మహాపురుషులు గుప్తరాజుల కాలంలో అవతరించారు. ఒకడు అసంగుడు, రెండవవాడు వసుబంధువు. వీరు ఈ శూన్యవాదంలో మూడవ శాఖను నెలకొల్పారు. వీరి శాఖని బాహ్యార్ధ శూన్యవాదం అంటారు.

అటువంటి శూన్యవాదం గ్రంథమే ఈ విగ్రహ వ్యావర్తిని. దీనిలో 72 శ్లోకములు ఉన్నాయి. ఇందులో నాగార్జుని జీవిత చరిత్ర గురుంచి మొదటగా వ్రాయబడింది. అందు నాగార్జునుడు వేదలి గ్రామవాసులు అని వ్రాయబడింది.ఇందులో ప్రతీర్య సముత్పాదముగతి, కాలము, ఆత్మ, తధాగతుడు, స్వభావము, విపర్యాసము, దృష్టి, నిర్వాణము, మొదలైన ధర్మాలగురుంచి నాగార్జుని పరీక్ష, వివరణ కనబడుతుంది. ఆ పిమ్మట శున్యవాదాన్ని గురుంచి నైయాయిక, వైశేషిక, భాట్ట, అద్వైతీత్యవాదులు చెప్పిన విగ్రహ పరిశీలనం ( విగ్రహం అంటే దూషణం) జరుగుతుంది.జైనుల వలే ఇందులో నాగార్జునుడు నీతి మార్గాన్ని బౌద్ధ ధర్మంగా ప్రధానంగా వివరించారు.

టిబెట్టు గ్రంధములలో నాగార్జుని చరిత్ర

[మార్చు]

టిబెట్టులో ఈతనని తత్త్వ వేత్తయేగాక, మంత్రవేత్త, తంత్ర వేత్త, రసాయిన వేత్తగా పరిగణిస్తారు.సువర్ణ విద్య నేర్చి, ఆర్తులైన మానవులకేగాక, మృగములకుకూడా సేవ చేయుటకు, బంగారము రెండు చేతులా దానము చేసిన దాత అని పేరు. ఆడిన మాట తప్పక తన శిరస్సునే ఇచ్చిన సత్యసంధుడు అని వీరి గ్రంథములు తెలుపుచున్నవి. వీరు కులాచార్య జ్ఞానశ్రీ అనే టిబెట్టు మఠాధిపతి భద్రకల్ప ద్రుమము అనే గ్రంథములో నాగార్జుని గురుంచి పలు విషయములు తెలియపరిచారు. దీనిని సీనో ఇండియన్ జర్నల్ 1948 డిసెంబరులో వ్యాసం ప్రచురించబడింది. దీని ప్రకారము:

ఆచార్య నాగార్జునుడు దక్షిణాపధంలో ఉన్న విదర్భ దేశంలో ఒక బ్రాహ్మణవంశంలో పుట్టాడు. తండ్రి జ్ఞానదేవుడు లేక గోశాలి. 7 సం.లు రోజూ సామాన్యులకు, బ్రాహ్మణులకు, శ్రమణులకు, వందలమందికి ఆతిధ్య మిస్తుండేవాడు. ఈతని తల్లిదండ్రులు ఈతనికి శాక్యుడనే పేరు పెట్టారు. శాక్యునికి సప్తవర్షప్రాయం రాగానే, అతని అభిరుచులననుసరించి వదలి ఉండాలనే ఆలోచన భరించరానిదై ఉన్నా, విదేశములకు పంపే ప్రయత్నం చేశారు.

నలేంద్ర (నలంద) చేరి సారహ (పాదు)ని దర్సించాడు. ఇతను శాక్యునికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించాడు. పిల్లవానిని మంత్రపధంలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఆయుర్దాయం పెరిగింది. అష్టవర్షానంతరం ఆచార్య రాహు భద్రుని ద్వారా సరస్వతీ పాదుల తరగతిలో ప్రవేశపెట్టబడ్డాడు. సారహ పాదుని వద్ద మహాయాన శాస్త్రమును చెప్పుకున్నాడు. పది సం. అనంతరం ప్రాచీ (పూర్వ దేశం) లో గొప్ప ఆచార్యుడనీ పేరు పొందిన కల్యాణ మిత్రుని వద్ద శిక్షణ పొందాడు. శ్రీమాన్ ప్రజ్ఞాసారమిత అనే బిరుదుని పొందాడు.

ఇతను తరువాత మహామంజురీ కురుకుల మొదలయిన తంత్రములను అభ్యసించాడు. ఈవిధముగా ప్రాపంచిక విజయమును ముఖ్యంగా రసాయినములలో పొందాడు. రసాయిన సిద్ధివలన వజ్రకాయ సిద్ధిని గడించాడు.

మొదట ఇతను రసాయినములలో భల్లవుని దగ్గర శిక్షణ పొందాడు. నిదానుని దగ్గర బంగారము చేయు ద్రావకముల గురించి కొన్ని వివరణములను సేకరించాడు. కాని ఈ విధానములవలన విజయం పొందలేదు. సారాబట్టీ పెట్టి విక్రయించు ఒక స్త్రీవద్ద ఈ రహస్యమును తెలిసికొని స్వర్ణవిద్యలో పరిపూర్ణత్వం గడించాడు. ప్రపంచ క్షామంలో ఇతను నలేంద్రలోని మహాయాన సంఘంలో చేరి రోగులకు పరిచర్య చేసాడు. తర్వాత ఇతను చంటిక (చండిక) అను దేవతను ఉపాసిస్తూ 12ఏండ్లు గడిపాడు.

హయఘోషుని వద్ద తారక మంత్రమును నేర్చుకున్నాడు. కు (గు)హ్యశీలు డనబడు బ్రాహ్మణుని శిష్యుడయిన త్రిపిట్కాచార్య హయపాలుని శిష్యుని కుమారుడు ఈ హయఘోషుడు. ధాన్యకటకంలో ఉన్న గొప్పలంకలోని మఠంలో నాగార్జునుడు మహాకాళే మంత్రమును, కురుకుల తంత్రం మొదలయినవాటిని గ్రహించాడు.

తర్వాత ఇతను మధ్యదేశంలో నూరు విహారములను నిర్మించాడు. అక్కడ మహాయానమునకు ధర్మములను ఏర్పాటు చేశాడు. ఆ ధర్మసంస్థకు మహాకాళీ మూర్తిని చేయించాడు. వజ్రశాన (బుద్ధగయ) లోని బోధిద్రుమంపై మాతంగులకున్న విరోధమును మానిపాడు. అక్కడ వృక్షం చుట్టూ బయట శరీర నిదానమును ఏర్పాటు చేసాడు. దాని చుట్టూ రాతి కిటికీలు గల చైతన్యములను 108 ని నిర్మించాడు. దక్షిణాపధంలో ధాన్యకటకంలో ఉన్న చైత్యం చుట్టూ ఇనుపరాతితో ప్రాకారం నిర్మించాడని వివరించబడింది.

తర్వాత ఇతను దక్షిణాట్యంలో ఉన్న జటసంఘరులయొక్క 500 వేదాంతులని ఓడించాడు. ఈవిధంగా శాసనం (ధర్మం) కొరకు వివిధ కార్యక్రములను పూర్తిచేశాడు.

'''తర్వాత తారా (శక్తి) ప్రేరణవల్ల శ్రీగిరి (శ్రీ కూటం) లో నిలబడిపోయినాడు.చివరకు రాజభాగుని (భద్రుని) చిన్న కుమారుడు వసుశక్తి, నాగార్జుని విరోధుల ప్రేరణవలన నాగార్జుని శిరస్సుని భిక్షలో అడిగాడు.దానిమీదట నాగార్జునుడు తన శిరస్సును దానం ఇచ్చి సుఖవతిస్థితిని పొందాడు.''' ఈవిధంగా అర్ధప్రకాశలో చెప్పబడిఉన్నది. తర్వాత ఈ శిరస్సు నాలుగు యోజనములు విసిరి వేయబడ్డది. ఆ శిరస్సు మొండెంతో కలిసి, మానవధర్మమును నెరవేర్చునని చెప్పబడింది.

ఈవిధంగా ఇక్కడ 200 సం.లు, మధ్యప్రదేశంలో 12 సం.లు, ఉత్తరాపధం. కింపురుషలో 200 సం.లు, పూర్వదేశంలో 100 సం. శ్రీగిరిలో 129 లేక 71 సం.లు జీవించాడు అని టిబెట్టు గ్రంథములు తెలుపు చున్నవి.

ఎస్.సి దాస్ అనే శాస్త్రవేత్త టిబెట్టు నుండి పలు గ్రంథములను సేకరించి అచ్చు వేయించాడు.అందులో 'DpagBsam' అనే గ్రంధము ఒకటి కలదు. ఇందులో నాగార్జుని జన్మస్థలము గురించి కొన్ని విషయములున్నవి. నాగార్జునుడు దక్షిణాపధంలొ ఉన్న '''కహోర''' అనేచోట జన్మించాడు. ఇది కంచిదగ్గర ఉంది. ఇతని కుటుంబం ఇక్కడి నుండి వెళ్ళి విదర్భలో ఉంటూ ఉండవచ్చు.ఇతని ముఖ్య శిష్యులలో ఒకడు నాగహవుడు ఒకడు. ఇతనే తధాగతభద్రుడు. ఇతను తన గురువువలే నలందలో ఆచార్య పదవిలో ఉన్నాడు. నాగార్జునుడు ఆంధ్ర సింహళములోని ధాన్యకటక, శ్రీగిరిమఠములలో పెక్కు ఏండ్లుండి పనిచేశాడు.

టిబెట్టు వారి భూగోళ శాస్త్రంలో ధాన్యకటకమనగా కృష్ణడెల్టాలో ఉన్నదని, దానిని ధనశ్రీలంక అని కూడా అంటారని ఉంది.

నాగ+అర్జునుడు అనగా నాగులకు అర్జునిని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అంటారు. కాని బౌద్ధకథలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడింది. అమరావతి చైత్యపురాళ్ళలో నాగుల విగ్రహాలు అనేకం ఉన్నాయి. మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.

నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి తక్షశిల వరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా! అనేక గ్రంథములకు వ్యాఖ్య రచించాడు. ఘోష అనగా సింహం గర్జించినట్లు చెప్పుట. మూడుసార్లు ధర్మఘోష చేశాడు. సింహం ఎట్లా నిస్సంకోచంగా గర్జిస్తుందో అట్లా ధర్మఘోష చేయమని బుద్ధ భగవానుడు చెప్పాడు.

మాధ్యమిక వాదం

[మార్చు]

శూన్యతావాదం

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]
అనుపు వద్ద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ శిథిల దృశ్యాలు

నాగార్జునుడు తన 67వ యేట శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు/మరనించినట్లు సొమదేవుని 'కథసరిథ్సాగరం' లొ తెలుపబడింది. గుంటూరు వద్ద ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము ఈయన స్మృత్యర్థం నెలకొల్పబడింది.

చిత్రమాలిక

[మార్చు]
అమరావతిలో ఒక శిల్పము

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kalupahana, David. A History of Buddhist Philosophy. 1992. p. 160.
  2. Buddhist Art & Antiquities of Himachal Pradesh, Omacanda Hala; Page 97
  3. http://www.iep.utm.edu/n/nagarjun.htm#H1
  4. http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol1_no1/1nagarjuna.htm Archived 2008-08-07 at the Wayback Machine
  5. Christian Lindtner, Master of Wisdom. Dharma Publishing, 1997, page 324
  6. David Kalupahana, Mulamadhyamakakarika of Nagarjuna: The Philosophy of the Middle Way; Motilal Banarsidass, 2005, pages 2-5

వనరులు

[మార్చు]