జైన మతం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
జైన మతం సాంప్రదాయికంగా జైన ధర్మ (जैन धर्म) , అని పిలువబడుతుంది. ఈ మతం kreesthu.పూ. 9వ శతాబ్దంలో పుట్టింది.[1][2]ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.[4]భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహం. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది.[5] జైన మతం శ్రమణ మతమని కూడా అంటారు.
చరిత్ర
[మార్చు]సా.శ..పూ. ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యధాతధ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్ర ఇరాన్ లో, చైనాలో కన్ఫ్యూషియస్లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. భారత దేశంలోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో, కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగి పోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి.అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కులవ్యవస్థ లతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. "వ్యక్తి ఆడగాని, మగ గాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. "ఆధ్యాత్మీకరణం" అన్నది నూతన విప్లవం.
ఈ నేపథ్యంలో భారత దేశంలో రెండు మతాలు, ఉపనిషన్మతానికి వ్యతిరేకంగా వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. ఈ రెండింటి తాకిడితో మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను, ఈ రెండు మతాల సవాళ్ళకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, ఏనాడూ ఈ మతాలు హిందూ మతంలో అంతర్భాగంగా ఉన్నాయి నేటికీ జైన మతస్తులు హిందూ దేవుళ్ళను పూజిస్తూ యజ్ఞ హోమధులు చేస్తుంటారు. [6]ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి.
వర్థమానుని జీవితం
[మార్చు]జైన మతాన్ని జైన వృషభనాథుడు స్థాపించాడు. "జిన" (విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో,అలాగే జినుని అసలు పేరూ జినుడు కాదు. వర్థమానుడు. ఇరవై నాలుగు జినులలో (తీర్థంకరుడు) ఒకడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. ఇతడు బుద్ధునికి అగ్ర సమకాలీనుడు.
ఉత్తర భారతంలో 599 బి.సిలో కుంద గ్రామం (వైశాలి ప్రస్తుతం నేపాల్ ) లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు రాజు, తల్లి త్రిశల. పెళ్ళయింది. భార్య యశోధర. ఒక కూతురు, అనోజ. ముప్పై సంవత్సరాల వయస్సులో, తల్లిదండ్రుల మరణానంతరం భార్యా బిడ్డలను వదిలి, సన్యాసం స్వీకరించాడు. అతడి కూతురు భర్త, (అల్లుడు) జమాలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
జైన మతం పురాతన సత్వం
[మార్చు]సన్యసించిన మొదట్లో అతడు నిర్గ్రంధులనే ఒక తెగ ఆచారాలను, విధానాలను అనుసరించారు. ఆ తెగను అంతకు 200 సంవత్సరాల ముందు పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. ఆ తరువాత 'నిర్గ్ంధ" పదాన్ని మహావీరుని అనుచరులకు మొదట్లో ఉపయోగించారు. పార్శ్వనాధుడు 22 వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్థమాన మహావీరుని కంటే ముందే ఉంటుందంటారు. అంతే కాదు, ఇది వేదమతం కాలం నుంచే ఉందంటారు. ఎలాగంటే ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, చివరివాడు వర్థమానుడని, మొదటి వాడు ఋషభదేవుడు, అరిష్టనేములని అంటారు. ఋషభదేవుడు మొదటి తీర్థంకరుడు. అతని గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతే కాదు యితడు విష్ణుపురాణం లో, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంత పాతది. ఈ 24 తీర్థంకరుల లేదా ప్రవక్తల ప్రవచనమే జైనం. ఆ 24 ప్రవక్తలు వీరు;
|
|
|
|
|
విశ్వం పుట్టి ఎన్నో వలయాల కాలం గడిచింది. ప్రతి వలయంలోనూ 24 మంది తీర్థంకరులు, పండ్రెండు మంది విశ్వ చక్రవర్తులు. మొత్తం మీద 63 మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. ప్రతి వలయంలో ఉచ్చ, నీచ స్థితులుంటాయి. శిఖర సమయంలో మనుష్యుల యొక్క శారీరక పరిమాణం చాలా ఎక్కువ. జీవితకాలం కూడా ఎక్కువే. ప్రస్తుతం ప్రపంచం పతనమవుతోంది. ఈ పతనం 40,000 సంవత్సరాలపాటు జరుగుతుంది . దీనిలో మనుషులు వామనులుగా ఉంటారు. జీవన కాలం 20 సంవత్సరాలే. కొండ గుహలలో నివసిస్తారు. సంస్కృతిని మరచిపోతారు.
దీని కనుగుణంగా వర్థమానుడు 10½ అడుగుల పొడవు ఉన్నాడు. 72 సంవత్సరాలు జీవించాడు. పార్శ్వనాధుడు 13⅓ అడుగుల పొడవు ఉన్నాడు. 100 సంవత్సరాలు జీవించాడు. ఇలాగే అంతకు ముందరి తీర్థంకరుల వయస్సు, ఎత్తులు ఎక్కువే.
వర్థమాన మహావీరుడు ఒకసారి నలందను దర్శించినప్పుడు అతనికి గోశాల ముస్కరీ పుత్రుడనే ఒక సన్యాసితో పరిచయం అయింది. వర్థమానునితో ప్రభావితుడైన ఆ సన్యాసి ఆరేళ్ళు వర్థమానుని తత్వాన్ని ప్రబోధించాడు. ఆ తరువాత అతడు చీలిపోయి "ఆజీవక మతము"ను స్థాపించాడు. వర్థమానుడు పదమూడు సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించి పోయింది. ఆ తరువాత వైశాఖ మాసం పదమూడవ రోజున జృంభిక గ్రామం (పార్శ్వ నాధ పర్వతాల దగ్గర) లో అతనికి "అంతర్భుద్ధి" కలిగింది. తరువాత అతడు 42 వ యేట మహావీరుడు లేదా జినుడు అయ్యాడు. అతని అనుచరులను నిర్గ్రంధులు అన్నారు. నిర్గ్రంధులు అంటే బంధాలు లేనివారు. తరువాత ముప్పై సంవత్సరాలు అతడు కోసల, మగధలలోనే కాక ఇంకా తూర్పు వైపుకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను తరచు కలిసేవాడు. అతడు తన డెబ్బై రెండవ యేట పావా (పాట్నా) జిల్లాలో బి.సి.527 లో మరణించాడు. కాని కొంతమంది పండితులు అతడిని బుద్ధుని కంటే చిన్నవానిగా భావించి బి.సి.458 లో మరణించాడన్నారు.
మహావీరుని బోధలు
[మార్చు]ఇతడి బోధనలు తాత్వికాలు. శృతి, స్మృతుల మీద అతడి బోధలు అధారపడలేదు. ఒక అర్థములో అతడు దేవతలు లేరన లేదు. కాకపోతే వారికి దివ్యత్వం లేదన్నాడు. అందువల్ల అతడి మతం నాస్తికం. వారివల్ల మానవులకు ఎటువంటి ప్రయోజనములేదు. తీర్థంకరుల కంటే వారు నిస్సందేహంగా తీసికట్టే. అతడి తత్వం ద్వైతం. అతడి ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవులు, రెండు అజీవులు. అజీవులు పదార్థం. అజీవులు అణు నిర్మితాలు. జీవులు అమర్త్యాలు. అజీవులు మర్త్యాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మ కారణంగా ఆత్మ బంధిత స్థితిలో ఉంటుంది. పునర్జన్మ కర్మ మీద అధారపడి ఉంటుంది. ఇక్కడ కర్మ పుద్గలం. పుద్గలం అంటే పదార్థం. కనుక ఈ సిద్ధాంతంలో కర్మ పదార్థం అవుతుంది. కంటికి కనిపించని పరా పరమాణువులే సూక్ష్మ పదార్థమే కర్మ. ఈ పదార్థంతో ప్రతి జన్మలోను ఆత్మ చుట్టూ "కర్మ శరీరం" ఏర్పడుతుంది.తరువాతి జన్మలో ఆత్మ ఏ జన్మ ఎత్తాలో ఈ కర్మ శరీరం నిర్ణయిస్తుంది. ఆత్మ, మోహాలు ఒక రకం జిగురు పదార్థాన్ని తయారు చేస్తాయి. ఇంద్రియానుభవం ద్వారా ఆత్మ లోకి ప్రవహించే పరా పరమాణు కణాలు ఆ జిగురు కారణంగా ఆత్మకు అంటుకొని, ఆత్మ చుట్టూ కర్మ శరీరాన్ని రూపొందిస్తాయి. కర్మ కణాలు ఆత్మ లోకి ప్రవహించటాన్ని "ఆస్రవం" అంటారు.
ఆత్మ సహజంగా కాంతివంతమైనది. సర్వజ్ఞాని, ఆనందమయి. ఈ విశ్వంలో అనంత సంఖ్యలో ఆత్మలున్నాయి. ప్రాథమికంగా అన్నీ సమానమే. కాని పరా పరమాణు పదార్థం అతుక్కోవడాన్ని బట్టి అవి వేరు వేరు అనిపిస్తాయి. అవి ఆత్మను కప్పడం వల్ల ఆత్మ కాంతి తగ్గిపోతుంది. ఆత్మలు జంతువులకు మనుషులకే కాక, రాయి రప్పకు, నీటికి కూడా ఉంటాయి.
పునర్జన్మ రాహిత్యం కావాలంటే మోహ వికారాదులను, ఇంద్రియానుభవాలను క్రమంగా తొలగించుకోవాలి. అందువలన, సన్యాసం, తపస్సులు అవసరమవుతాయి. చివరకు కర్మ శరీరాన్ని తొలగించుకొన్న సన్యాసి మహావీరునిలా, మరణం అంటే భయపడక, ఆహార త్యాగంతో మరణించాలి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. నిర్వాణం అంటే ఏమిటో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వివిధ మతాలు, వివిధ వ్యక్తులు, దానిని వివిధంగా వర్ణించారు. కాని జైన మతంలో నిర్వాణం అంటే ఉన్నత స్వర్గం కంటే పైన నిషియాత్మకమైన సర్వజ్ఞానమయమైన శాశ్వతానుభవం.
పరివ్రాజకుడు, గృహస్తు - ఎలా నడుచుకోవాలో జైనం వివరించింది. నిర్వాణం లక్ష్యం కనుక, మనిషి దుష్కర్మలను పరిహరించాలి. అంతే కాక, క్రమంగా నూతన కర్మలు చేయకుండా ఉన్న కర్మలను వినాశం చేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అవి సరైన విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ప్రవర్తనలు, మంచి నడతకు ఐదు ప్రమాణాలున్నాయి.
- అహింస
- సత్యం (అబద్దమాడకుండుట)
- అస్తేయం (దొంగతనం చేయకుండుట)
- బ్రహ్మచర్యం
- అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకుండుట)
సమ్యగ్విశ్వాసం అంటే జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా, మామూలు గృహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం. సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మెలగాలి.
సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింసా విధానం ఎంతవరకు వెళ్ళిందంటే, భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమినే దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలస పోయి, వ్యాపారాలలో స్థిరపడ్డారంటారు.
అన్ని వస్తువులకు - జీవులు గాని - అజీవులు గాని - వివిధ స్థాయిలలో చైతన్యం ఉంది. వాటికి ప్రాణం ఉంది. గాయాలైతే అవి బాధ పడతాయి. అందువలన అహింసను అంత ప్రముఖంగా పరిగణించారు.
ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడన్నా, దానినతడు నిర్దేశిస్తాడన్నా మహావీరుడు అంగీకరించడు. అతడి ప్రకారం సృష్టి లేదు. సృష్టి కర్త లేడు. అసలు ఈ ప్రపంచాన్ని వివరించటానికి ఏ రకమైన సృష్టి కర్త అవసరం లేదు. అతడి ఉద్దేశంలో దేవుడు అంటే అంతర్గత శక్తులు పూర్తిగా అభివ్యక్తమైన మానవుడు, పరిపూర్ణ మానవుడు.
వేదాధికారాన్ని తిరస్కరించాడు. కర్మ కాండను కాదన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని త్రొసిపుచ్చాడు.
జైనం లో చీలిక
[మార్చు]రెండు శతాబ్దాల పాటు జైనం, సన్యాసులు, ఉపాసకులతో కూడిన చిన్న సమూహంగా కొనసాగింది. తరువాత మౌర్య చంద్రగుప్తుడు జైన సన్యాసి అయినట్లు సంప్రదాయం ఉంది. అప్పుడు జైనం కొంత ప్రాబల్యాన్ని పుంజుకొంది. చంద్రగుప్తుని పాలనాంతంలో ఒక పెద్ద కాటకం సంభవించింది. అప్పుడు జైన సన్యాసులు చాలా మంది. గంగానదీ లోయలోంచి దక్షిణాదికి వలస పోయారు. అక్కడ వారు కొన్ని ముఖ్య జైన కేంద్రాలను నెలకొల్పారు.
ఈ వలస నుంచి చీలిక ఏర్పడింది. కారణం ఆరామ క్రమశిక్షణ మీద వచ్చిన వివాదం. వలసకు నాయకత్వం వహించిన బధ్రబాహుడు (badrabahudu), వర్థమానుడు నొక్కి చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలన్నాడు. అక్కడే నిలిచి పోయిన సన్యాసులు నాయకుడైన స్థూలభద్రుడు (stulabahudu) కాటకం, గందరగోళాల కారణంగా, శ్వేతాంబరాలను ధరించటానికి అనుమతించాడు. ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర చీలిక అంతిమ రూపం దాల్చలేదు. సైద్ధాంతికంగా రెండింటి మధ్య పెద్ద తేడాలు లేవు. తరువాత దిగంబర జైనులు బయటికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకొనేవారు. కాని ఈ విభజన నేటికీ ఉంది.
రెండు వర్గాల నడుమ తేడాలు
[మార్చు]- నిర్వాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు, కాదని శ్వేతాంబరులు భావించారు.
- స్త్రీలకు విముక్తి లేదన్నారు దిగంబరులు. శ్వేతాంబరులలో 19 వ తీర్థంకరుడైన మల్లినాథుడు స్త్రీలకు విముక్తి ఉందన్నాడు.
- దిగంబరులు ఆగమ (మత) గ్రంథాల అధికారాన్ని కాదన్నారు. నాలుగు వేదాల లాగే వారికి వారి "చతుర్పూర్వలు" ఉన్నాయి.
- దిగంబరులలో ఎక్కువ మంది. దేవాలయాలలో విగ్రహ పూజ చేస్తారు. శ్వేతాంబర జైనులు పవిత్ర నివాసాలలో (స్థానకాలలో) ఉండి జైన గ్రంథ బోధలను చెబుతారు. శ్వేతాంబరులలోనూ విగ్రహారాధకులు లేకపోలేదు.
- దిగంబరులు మహావీరుని, తీర్థంకరులను గుడులలో పూజిస్తారు. వీరికి అనేక సంఘాలున్నాయి. నంది సంఘం, సిన్ సంఘం, దేవ్ సంఘాలు.వీరు తరన్ స్వామి (1448-1515) విరచిత గ్రంథాలను చదువుతారు. శ్వేతాంబరులు స్థానకాలలో ఉంటూ కాలినడకన ఒకచోటు నుండి మరో చోటుకు వెళ్ళి బిక్ష గ్రహిస్తారు. సూర్యాస్తమయం ముందే భోజనం చేస్తారు.
పండుగలు, విగ్రహారాధన
[మార్చు]వీరి ముఖ్యమైన పండుగ "పర్యుషాన" ఇది ఏడు రోజులపాటు జరుగుతోంది. ఈ ఏడు రోజులనందు గాని, కూరగాయలు తినరాదు. పవిత్ర స్థానకాలకు వెళ్ళి ధ్యానము చేసి 48 నిముషాలు పూజ జరుపుతారు. ఈ రకమైన ధ్యానాన్ని "సామయిక" మంటారు. ఈ ధ్యానాన్ని ఉదయ సాయంత్రాలలో ఇంట్లో చేసుకోవచ్చు. ఎనిమిదవ రోజు "సమ్వత్సరి" జరుపుకోవటంతో 'పర్యుషాన" ఒకకొలిక్కి వస్తుంది. ఈ సమయంలో, తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే, క్షమాపణ వేడుకుంటారు.కొంతమంది శ్వేతాంబరులు విగ్రహరాధన చేస్తారు. వారికి 84 గఛ్ఛాలు (పరిషత్తులు) ఉన్నాయి. వాటిలో ఉపేక్ష, తవ, పెచంద, భార్తరా, ఫనేయుతా, అంచల్, అగమికలు ముఖ్యమైనవి.
మరో చీలిక
[మార్చు]తరువాత మరో చీలిక వచ్చింది. ఇది ఇరువర్గాలలోనూ వచ్చింది.రెండు వర్గాలలో కోందరు అనుచరులు పూర్తిగా విగ్రహారాధన వదిలివేసి, పవిత్ర గ్రంథాల పూజకు అంకితమయ్యారు. శ్వెతాంబరులలో వీరిని తేర పండితులని, దిగంబరులలో వీరిని సమేయాలని అంటారు.
జైన జ్ఞాన వాదం
[మార్చు]దార్శనికంగా ఇది సాంఖ్యదర్శనానికి దగ్గరగా ఉంటుంది. దీని వాదాన్ని "స్యాద్వాదం" అంటారు. అంటే ఇది "బహుశ కావచ్చు" అనే వాదం. ఒక వస్తువు ఉన్నదా? అని ప్రశ్నిస్తే, దానికి ఈ సిద్ధాంతం ప్రకారం ఏడు రకాల సమాధానాలు చెప్పవచ్చు.
- అది ఉన్నది (స్యాదస్తి)
- అది లేదు (స్యాన్నాస్తి)
- అది ఉన్నది లేదు (స్యాదస్తి నాస్తి)
- అనభిదేయనీయం (స్యాదవక్తవ్యం)
- అభిధేయనీయ మనభిధేయనీయం (స్యాదస్తి అపక్తవ్యం)
- అది లేదు అనభిధేయ నీయం (స్యాన్నాస్తి అనవక్తవ్యం)
ఉన్నది లేదు అనభిధెయనీయం (స్యాదస్తి నాస్తి అపక్తవ్యం)
దీనినే కాంతవాదమని అంటారు. జ్ఞానం ఇదమిద్ధం కాదు. దేని గురించి అయినా "అయివుండవచ్చు" అని చెప్పగలమే కాని, కచ్చితంగా ఇలా జరుగుతుందని గాని, ఇలా ఉంటుందని గాని చెప్పలేము.
ఈ ప్రపంచంలోని వస్తువులను, సంఘటనలను అర్థం చేసుకొవటానికి మరో థోరణి కూడా ఉంది. దీనిని "నయ" వాదమని అంటారు. దీనిలో ఏడు థోరణులున్నాయి.
- నైగర
- సంగ్రహ
- వ్యవహార
- ఋజుసూత్ర
- తబ్ద
- సమాభిరుధ
- ఏవంభూతనయాలు
దీనికి "సప్త భంగినయ" మని గూడా అనవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో జైన మతం
[మార్చు]జైనగాథల ప్రకారం జైనమతం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు కొనకుండ్ల (అనంతపురం జిల్లా) లో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.ఆంధ్రదేశంలో జైనమతము బహుళ ప్రాచుర్యము పొందినది అనడానికి ఇక్కడ వారు నిర్మించుకున్న గుహల వలన కొంత రుజువు చెందుతుంది. గుంటుపల్లి (కామవరపుకోట) లోని గుహలు బీహారులోని అజీవకు లకు నిర్దేశింపబడిన గుహలకు వాస్తు విషయములలో ఏమాత్రము తేడా కనపడనందున ఇవి జైన మతమునకు సంబందించిన గుహలగానే చెప్పుచుందురు. ఇవికాక రామతీర్థం (నెల్లిమర్ల) , శాలిహుండం మొదలగుచోట రాతితో మలచబడిన చిన్న చిన్న ఉద్దేశిక స్తూపములు, జైన స్వస్తిక చిహ్నములు ఇక్కడ జైన మతవ్యాప్తికి చిహ్నములు. ఒరిస్సా-కోస్తా ఆంధ్రప్రాంతములలోని అవశేషములు, కృష్ణా నదీతీర ప్రాంత అవశేషములు రెండూ భిన్న సాంప్రదాయములను సూచిస్తున్నవి. శాలిహుండులోని అవశేషములు, అమరావతిలో కొన్ని అవశేషములు రెండును మౌర్యుల కాలమునాటివే.వీరికాలమున అయోధ్యలోని ఇక్ష్వాకు వంశపు రాజులు కొంతమంది కోస్తా ప్రాంతములోని జైనసాంప్రదాయమునకు కారకులని కొంతమంది చరిత్రకారులు ఊహించుచున్నారు.అందుకే కోస్తా ప్రాంత అవశేషములకు కృష్ణాతీర అవశేషములకు కొంతతేడా కనిపించును. కోస్తా ప్రాంతమును ఏలిన చాళుక్యరాజగు కుబ్జ విష్ణువర్ధనుడు, జైనమతముపట్ల ఎక్కువ అభిమానమున్నవాడు. ఇతని భార్య అయిన మహాదేవి విజయవాడలోని దుర్గ కొండపై నదుంబవసతి అని వసతి ప్రదేశమును జైనులకు స్థాపించెను.ఇది ప్రజ్ఞాశాలి అయిన కవి భద్రాచార్యుని ఆధ్వర్యంలో ఉండేది. ఇట్లు అనేక జైన మత ప్రవక్తలు ఆంధ్రదేశమునందు వచ్చి జైన క్షేత్రములను ఏర్పరిచిరి. కాని బౌద్ధముయందున్న నమ్మకము, ఆంధ్ర ప్రజలకు జైనులయందు లేకుండెను. ఏలనలన జైనమునందు కర్మకాండలు ఆచరించుట ఎంతో కష్టముగా ఉండేవి. బౌద్ధులు మాధ్యమికవాదము అర్ధము చేసుకొనుటకు, సులభముగా ఉండుటయేకాక, ఆచార్య నాగార్జునుడు, జయప్రజాచార్యులు, ఆర్యదేవుడు మొదలగు ప్రతిభావంతులు బౌద్దమత ప్రగతికి దోహదపడిరి.
అహింస
[మార్చు]ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది.జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు.అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు.నేలకింద పండే దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. అహింసయే పరమ ధర్మం అని విశ్వసిస్తారు.
జీవులు 5 రకాలు
[మార్చు]జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి.
- పృథ్వీకాయ జీవులు : రాళ్ళు, మట్టి, గవ్వ
- అప్కాయ జీవులు : మంచు, ఆవిరి, నీరు, వాన
- తేజోకాయ జీవులు : మంట, మెరుపు, బూడిద
- వాయుకాయ జీవులు : గాలి, తుఫాన్
- వనస్పతిక జీవులు : మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు.
ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని ఆహారం, శరీరం, ఇంద్రియాలు, శ్వాసల ద్వారా స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకుని బతుకుతాయి.
జైనులకు మైనారిటీ హోదా
[మార్చు]మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. (ఆంధ్రజ్యోతి 20.12.2008)
జైనుల కట్టడాలు-శిల్పం
[మార్చు]జైనుల కట్టడాలలో ప్రతీదీ ఎంతో నేత్రపర్వంగా వుంటుంది. వారి ఆరామాలు, ఆలయాలూ, ఎక్కువ భాగం విశాల ప్రదేశాలలో నిర్మితాలు.వీఉ దేవాలయాలను సమూహాలుగా నిర్మిస్తారు. గిర్నరా శిల్పాలు బహు ప్రాచుర్యాన్ని పొందిన జైన శిల్పాలు. అదే విధంగా చిత్తూరులోని జయస్తంభాలు, ఆబూశిఖరం మీద ఆలయాలు మనోహర నిదర్సనాలు.బెంగాలులోని పార్శ్వనాధ విగ్రహ మున్న సమేతశిఖర తీర్ధము, పాట్నాలోని జలమందర తలమందర దేవాలయములు మరికొన్ని నిదర్సనాలు. జైన శిల్ప శిథిలాలలో ముందు మన దృష్టిని ఆకర్షించేవి ఒరిస్సాగుహలు. వీటిలో చాలా భాగము తీర్ధంకర విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఈ తీర్ధంకురులలో పార్స్వనాధుడు అత్యంత ప్రముఖ స్థానం పొందినది. ఈ గుహలలో త్రిశూలలు, స్తూపాలు, స్వస్తికలు, చక్రాలు, శ్రీదేవీ విగ్రహాలు, తదితర ప్రతీకలు ఉన్నాయి. జైనశ్రమణులు పెద్దపెద్ద సంఘాలుగా నివసించే ఆచారము లేదు. అందువలన బౌద్ధ చైత్యాలను పోలిన మందిరాలు వీరికవసరము లేకపోయింది. ఉదయగిరిగుహలు చాలా ప్రాచీనమైనవి. ఖండగిరిలోనివి తరువాతి కాలములోనివి.ఉదయగిరిలోని హాతిగుంఫ చాల ప్రకృతిసిద్ధ మయినది. ఇందులో ఖరవేల రాజ్యకాలం నాటి ఒక అపభ్రంశ ప్రాకృత శాసనము ఉంది. దానివల్లనే ఈగుహకు అంత ప్రాచుర్యము. ఈ గుహలోని శిల్పంలో మధుర శిల్పంలో వలెనే స్త్రీ పురుషుల వేష ధారణలలో గ్రీసుభారత శైలుల సమ్మిళితప్రభావం స్పష్టముగా కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆభ్రణ సౌభాగ్యము, శాస్త్ర నైపుణ్యమేగాక అక్కడక్కడా వినూత్న భావశబలతా, జీవితసౌందర్యము, సునిశితహాస్యము, కూడా కనబడును.ఈ ఘట్టాలలో ఆఖేటమూ, యుద్ధమూ, నాట్యమూ, శ్ర్ంగారమూ, మొదలయిన జీవన శైలిలు కనబడును.
జైనశిల్పాలలో లేదా కట్టడాలలో రెండు ప్రత్యేక గుణాలు కనిపిస్తాయి-స్తూపారాధన, విగ్రహారాధన, స్తూపాలు ప్రథమంలో ప్రసిద్ధ మతాచార్యుల నిర్యాణచిహ్నాలుగానే పరిగిణింపబడినా క్రమంగా రానురానూ అసమానశిల్పకళానిలయాలుగా మారిపోయాయి. ఇందుకు మధురలోని వోద్వ స్తూపమే నిదర్సనము. స్తూప నిర్మాణము బౌద్ధులలో ఉన్నంత ప్రబలంగా జైనులలో లేక పోయినా వీరు కూడా ఇందులో ఒక ప్రశంసాపాత్రమైన స్థితిని చేరుకున్నారు.
జైనులకు వారి 24 తీర్ధంకరులు ముఖ్యమైన ఆరాధ్య దైవతాలు.కాని మహాయాన బౌద్ధులలోవలెనె వీరుకూడ భువనాధిపతులు, వ్యోమాంతరులు, వైమానికులు, జ్యోతిష్కులు అని చతుర్విధ విభాగంతో వ్యక్తమవుతున్న ఇంద్రుడు, గరుడుడు, గంధర్వులు, అప్సరసలు, సరస్వతి మొదలయిన హిందూ దేవతలను కూడా ఆరాధించేవారు.తీర్ధంకురుల విగ్రహాలకు ఒక్కొక్కదానికి అడుగున ఒక్కొక్క సంజ్ఞ ఉంటుంది.సామాన్యంగా అవి బుద్ధ ప్రతిమల వలె పద్మాసనస్థానములో చిత్రితములై ఉంటాయి
చిత్రమాలిక
[మార్చు]-
రాతిలో చెక్కబడిన జైన తీర్థాంకరుని ప్రతిమ, రామతీర్థం, విజయనగరం జిల్లా
-
ధ్యానం చేస్తున్న జైన మహిళలు.
ఇవీకూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ . . .from Hindi Jaina, from Skt. jinah "saint," lit. "overcomer," from base ji "to conquer," related to jayah "victory." etymonline.com entry
- ↑ Hindi jaina, from Sanskrit jaina-, relating to the saints, from jinaḥ, saint, victor, from jayati, he conquers. dictionary.com entry
- ↑ Singh, Ramjee Dr. Jaina Perspective in Philosophy and Religion, Faridabad, Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha, 1993.
- ↑ Mehta, T.U (1993). "Path of Arhat - A Religious Democracy". Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha. Retrieved 2008-03-11.
- ↑ 2001 India Census http://www.censusindia.gov.in/Census_Data_2001/India_at_glance/religion.aspx.
- ↑ జైన మతస్తులు నేటికీ హిందూ దేవుళ్ళను పూజిస్తారు
బయటి లింకులు
[మార్చు]- eJainDharam.com, Worlds Biggest Information Portal Under Development.
- Click Here, Unique web journal of Jain dharma, IN Chronological Order!
- jainuniversity.org, Jain Education and Information