Jump to content

కాగ్

వికీపీడియా నుండి

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు సంక్షిప్త రూపమే కాగ్ (CAG). కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి, రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పించటం కాగ్ యొక్క ప్రధాన విధి. భారత రాజ్యాంగంలో 148 నుంచి 151 వరకు ఉన్న అధికరణలు కాగ్ గురించి తెలుపుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా 1858లో మొదటిసారి మన దేశంలో అక్కౌంటెంట్ జనరల్ పేరుతో ఈ అధికారిక స్థానాన్ని ఏర్పాటు చేసారు. 1919 చట్టం ద్వారా కాగ్ చట్టబద్ధతను సంతరించుకుంది. 1935 చట్టంతో ఈ పదవికి సంపూర్ణత చేకూరింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో కాగ్ ను కంప్ట్రోలర్ ఎక్కౌంటెంట్ అండ్ ఆడిటర్ జనరల్ గా వ్యవహరించేవారు. 1976లో అక్కౌంట్స్ ను దీనినుంచి వేరు చేసారు.

నియామకం-జీతభత్యాలు

[మార్చు]

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సం. వయస్సు ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. కాగ్ వేతనాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. రాష్ట్రపతి లేదా ఆయన నియంత్రించే అధికారి సమక్షంలో కాగ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన వేతనం కాగ్ కు లభిస్తుంది. కాగ్ జీత భత్యాలపై ఎలాంటి ఓటింగ్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.

అర్హతలు

[మార్చు]

కాగ్ గా నియమితులయ్యె వారికి అక్కౌంటెంట్ విషయాల్లో పదేళ్ళకుపైగా అనుభవం ఉండాలి. అసమర్థత, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై కాగ్ ను పదవినుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిని అనుసరించాలి.

అధికారాలు-విధులు

[మార్చు]

కాగ్ భారత అక్కౌంట్ అండ్ ఆడిట్ శాఖ తరపున విధులు నిర్వర్తిస్తారు. భారత రాజ్యాంగం 148 అధికరణం ద్వారా కాగ్ కు స్వతంత్ర ప్రతిపత్తి అధికారి స్తాయిని కల్పించారు. పదవీ విరమణ తర్వాత దేశంలో ఎలాంటి ఉద్యోగాన్నీ చేపట్టరాదు. 1971లో రూపొందించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధికారాలు, విధులు సర్వీసు నిబంధనల చట్టాన్ని అనుసరించి విధులను నిర్వర్తిస్తారు. కాగ్ యొక్క ప్రధాన విధులు:

• కేంద్ర రాష్ట్రాల ఆదాయాలు, సంఘటిత నిధులనుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం

• కంటింజెన్సీ నిధులనుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం

• ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యాపారం, ఉత్పత్తి, లాభాలు, నష్టాల లెక్కలను తనిఖీ చేయడం

• ప్రభుత్వ స్టొర్స్, కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల లెక్కలను తనిఖీ చేయడం[1]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (26 March 2022). "రాజ్యాంగపర, చట్టపరమైన సంస్థలు". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.