Telangana: విద్యా ప్రమాణాల పెంపునకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో AI
ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది.
![Telangana: విద్యా ప్రమాణాల పెంపునకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో AI](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/ai-based-digital-education.jpg?w=1280)
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, పాఠశాల విద్యా శాఖ ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఎక్ స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ ఫౌండేషన్ విద్యా రంగంలో డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి Already పనిచేస్తోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని దీని కో-ఫౌండర్.
ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా నేతృత్వంలోని ప్రతినిధల బృందం బెంగళూరులోని ఎక్ స్టెప్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. ఆమెతోపాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా, AI ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు, పాఠశాల విద్యలో నూతన అభ్యాస పద్ధతులు, డేటా ఆధారిత అధ్యయన విశ్లేషణలు, ఉపాధ్యాయుల శిక్షణా విధానాలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి.
AI ఆధారిత డిజిటల్ విద్యలో కీలక అంశాలుః
తెలంగాణలో ఎక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమలు చేయనున్న విద్యా ఆధునికీకరణలో ముఖ్య అంశాలు:
ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ (FLN): ప్రాథమిక విద్యా స్థాయిలో AI ఆధారిత టూల్స్ ద్వారా పిల్లల్లో రాయడం, చదవడం, సంఖ్యా విజ్ఞానం పెంపొందించడం.
AI-డిజిటల్ లెర్నింగ్: AI ఆధారిత విద్యా ప్లాట్‌ఫార్మ్‌లు, పర్సనలైజ్డ్ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల అభ్యాస పద్ధతులను మెరుగుపరచడం.
Data-Driven Insights: విద్యార్థులలోని బలహీనతలను గుర్తించి, కస్టమైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అభ్యాసంలో మెరుగుదల సాధించడం.
ఉపాధ్యాయుల వృత్తిపరమైన శిక్షణ: డిజిటల్ టూల్స్ వినియోగంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించడం, నూతన విద్యా విధానాలను అందిపుచ్చుకునేలా చేయడం.
తెలంగాణ ప్రతినిధుల బృందం ఇటీవల కేరళ రాష్ట్రాన్ని సందర్శించి, అక్కడి AI ఆధారిత విద్యా విధానాలను అధ్యయనం చేసింది. కేరళ ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ తెలంగాణలో కూడా అనుసరించాలనే ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే AI ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు ప్రవేశపెట్టేందుకు సమగ్ర ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోంది. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు, ఉపాధ్యాయులకు శిక్షణ, స్నేహపూర్వక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లతో విద్యా రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..