Jump to content

ఫ్లైట్ రికార్డర్

వికీపీడియా నుండి
ఒక విమాన డేటా రికార్డర్. (దీనిపై ఉన్న హెచ్చరిక సందేశం: ఫ్లైట్ రికార్డర్ తెరవవద్దు)

ఫ్లైట్ రికార్డర్ అనగా ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. దీనిని విమాన ప్రమాదాలు, సంఘటనల విచారణ సదుపాయ ప్రయోజనం కోసం విమానంలో ఉంచుతారు. సాధారణంగా దీనిని బ్లాక్ బాక్స్ గా సూచిస్తారు, విమాన రికార్డర్ లో రెండు సామాన్య రకాలు ఉన్నాయి, ఒకటి విమాన డేటా రికార్డర్ (ఎఫ్డిఆర్), మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్). కొన్ని సందర్భాల్లో, రెండు రికార్డర్లు ఒకే యూనిట్‌గా కలిసి ఉండవచ్చు. విమాన రికార్డర్లు విమానం తీవ్రమైన ప్రమాదానికి గురైనప్పుడు కూడా పాడవకుండా తమ ఉనికిని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. దాదాపు అన్ని విమానాలలోనూ, హెలికాఫ్టర్‌లలోనూ ఫ్లైట్ రికార్డర్ ఉంటుంది. విమాన డేటా రికార్డర్ (ఎఫ్డిఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్)లను దేనికది ప్రత్యేకంగా ఈ బాక్స్‌లలో భద్రపరచి ఉంటాయి. దీనిని అత్యంత నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. ఇది దాదాపు వెయ్యి సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా రూపొందించబడి ఉంటుంది. ఇది నీటిలో తడిసినా, రెండు రోజుల పాటు సముద్ర నీటిలో మునిగిపోయి ఉన్నను తుప్పు పట్టదు. విమాన ప్రమాదం జరిగినప్పుడు అది ఏ విధంగా జరిగింది తెలుసుకొనుటలో ఇది కీలకమైనది. ఇది ముదురు నారింజరంగులో ఉంటుంది.

ఫ్లైట్ డేటా రికార్డర్

[మార్చు]

ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఒక రకపు విమాన రికార్డర్. దీనిని సంక్షిప్తంగా ఎఫ్‌డిఆర్ (FDR) అంటారు. ఇది విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలు పంపిన సూచనలను రికార్డ్ చేయడానికి విమానం నందు ఉంచే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది విమాన పనితీరును పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. ఇది విమాన అంతర్గత ఉష్ణోగ్రతను, విమాన వేగాన్ని, ఏ దిశగా ప్రయాణించింది, గాలి పీడనం ఎంత ఉన్నది వంటి 64 విధాలైన పరికరాల పనితీరును నమోదు చేస్తుంది. ఇది ఏకధాటిగా 25 గంటలపాటు సమాచారాన్ని నమోదు చేయగలుగుతుంది.

కాక్పిట్ వాయిస్ రికార్డర్

[మార్చు]

కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఒక రకపు విమాన రికార్డర్. దీనిని సంక్షిప్తంగా సివిఆర్ (CVR) అంటారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ విమానంలోని పైలట్ల, అసిస్టెంట్ పైలట్ల, ఇంజనీర్ల, విమాన ప్రయాణికుల, తదితర వైమానిక సిబ్బంది మధ్య జరిగే సంభాషణలను, ఇతరత్ర శబ్దాలను రికార్డు చేస్తుంది.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 02-09-2014 - (బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?)