Jump to content

జాన్ ఆర్చిబాల్డ్ వీలర్

వికీపీడియా నుండి

జాన్ ఆర్కిబాల్డ్ వీలర్ ( 1911 జూలై 9 - 2008 ఏప్రిల్ 13), [1] అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యునైటెడ్ స్టేట్స్‌లో సాధారణ సాపేక్షతపై ఆసక్తిని పునరుద్ధరించడానికి అతను ఎక్కువగా బాధ్యత వహించాడు. కేంద్రక విచ్ఛిత్తి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను వివరించడంలో వీలర్ నీల్స్ బోర్‌తో కలిసి పనిచేశాడు. గ్రెగొరీ బ్రెయిట్‌తో కలిసి, వీలర్ బ్రెట్-వీలర్ ప్రక్రియ భావనను అభివృద్ధి చేసాడు. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఊహించిన గురుత్వాకర్షణ పతనం ఉన్న వస్తువులకు "కృష్ణ బిలం" అనే పదాన్ని ఉపయోగించాడు. "క్వాంటం ఫోమ్", "న్యూట్రాన్ మోడరేటర్", "వార్మ్‌హోల్", "ఇట్ ఫ్రమ్ బిట్" లను కనుగొన్నాడు. "వన్-ఎలక్ట్రాన్ విశ్వం"ను ఊహించాడు.

వీలర్ కార్ల్ హెర్జ్‌ఫెల్డ్ పర్యవేక్షణలో జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందాడు. నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఫెలోషిప్‌లో బ్రెయిట్, బోర్ అధ్వర్యంలో చదువుకున్నాడు. 1939 లో, బోహర్‌తో కలిసి విచ్ఛిత్తి యొక్క యంత్రాంగాన్ని వివరించడానికి ద్రవ డ్రాప్ మోడల్‌ను ఉపయోగించి వరుస పరిశోధనా పత్రాలను వ్రాసాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అతను చికాగోలోని మాన్‌హాటన్ ప్రాజెక్ట్ మెటలర్జికల్ లాబొరేటరీతో కలిసి పనిచేశాడు. అక్కడ అతను అణు రియాక్టర్ల రూపకల్పనకు సహాయం చేసాడు. ఆపై వాషింగ్టన్‌లోని రిచ్‌లాండ్‌లోని హాన్‌ఫోర్డ్ సైట్‌లో డుపోంట్ వాటిని నిర్మించడంలో సహాయం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత అతను ప్రిన్స్‌టన్‌కు తిరిగి వచ్చాడు, కాని 1950 ల ప్రారంభంలో హైడ్రోజన్ బాంబును రూపొందించడానికి, నిర్మించడానికి తిరిగి వచ్చాడు.తన కెరీర్‌లో ఎక్కువ భాగం, వీలర్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అతను 1938 లో చేరి, 1976 లో పదవీ విరమణ చేసే వరకు అక్కడే ఉన్నాడు. ప్రిన్స్‌టన్ లో అతను 46 పిహెచ్‌డిలను పర్యవేక్షించాడు.

పరిశోధనలు

[మార్చు]

లైబ్రేరియన్‌ అయిన తండ్రి ఇంటికి తెచ్చే ప్రతి పుస్తకాన్నీ చదవడం అతనిలో ఉత్సుకతను రేపింది. అదే అతడిని ప్రపంచం మర్చిపోలేని శాస్త్రవేత్తను చేసింది. అతను భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేయడమే కాదు, అతని సాపేక్ష సిద్ధాంతానికి ప్రాచుర్యాన్ని తెచ్చే అంశాలను అన్వయించిన వ్యక్తి‌. ఒక అధ్యాపకుడిగా అతను కొందరు విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం విశేషం. సైద్ధాంతిక శాస్త్రవేత్తగా పేరొందిన జాన్‌వీలర్‌ బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం), వర్మ్‌హోల్‌ (కీటకబిలం) లాంటి శాస్త్రీయ పదాల సృష్టితో విశ్వంపై అవగాహన పెంచే సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) సిద్ధాంతం, ఆటంబాంబుల నిర్మాణంలో వీలర్‌ పాత్ర కీలకమైనది.

జీవిత విశేషాలు

[మార్చు]

అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విలాలో 1911 జూలై 9న పుట్టిన జాన్‌వీలర్‌ నలుగురి సంతానంలో పెద్దవాడు. గ్రంథాలయంలో ఉద్యోగి అయిన తండ్రి ఇంటికి తెచ్చే పుస్తకాలను వదలకుండా చదవడమే చిన్నప్పుడు అతడి వ్యాపకం. ఆ అలవాటే అతడి ఆలోచనలకు పదునుపెట్టింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూ కొయ్యతో తాళాలు, పిస్తోలు, కూడికలు చేసే యంత్రం, స్ఫటికాలతో పనిచేసే రేడియో, టెలిఫోన్‌ నమూనాలు చేస్తూ కాలం గడిపేవాడు.

ఫ్లోరిడాలో పట్టభద్రుడై, జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన వీలర్‌ జర్మనీ వెళ్లి ప్రముఖ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌ పర్యవేక్షణలో పరిశోధనలు చేశాడు. ఆపై అమెరికాలోని నార్త్‌ కెరోలినా, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనావృత్తిలో దాదాపు నాలుగు దశాబ్దాలు కొనసాగాడు. ఐన్‌స్టన్‌ సాహచర్యంలో ఆయన చేసిన పరిశోధనలు ముఖ్యమైనవి. ఐన్‌స్టీన్‌ సామాన్య సాపేక్ష సిద్ధాంతంలో ప్రయోగాల ప్రసక్తి లేకపోవడంతో అది కొన్నేళ్లపాటు నిరాదరణకు గురైంది. ఆ దశలో వీలర్‌ ఆ సిద్ధాంతాన్ని విశ్వవ్యాపనం (expanding universe) అనే అంశానికి అన్వయించి దానికి ప్రాచుర్యం తెచ్చాడు.[2]

అలాగే కణభౌతిక శాస్త్రం (Paricle Physics) లో ప్రముఖ పాత్ర వహించే 'ఎస్‌-మ్యాట్రిక్స్‌' సిద్ధాంతాన్ని సమకూర్చింది ఈయనే. నీల్స్‌బోర్‌తో కలిసి ఆయన ప్రతిపాదించిన ద్రవబిందు నమూనా (Liquid drop model) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబుల రూపకల్పన ప్రాజెక్ట్‌లలో కీలక పాత్ర వహించారు. ఆయన కృషికి గుర్తింపుగా అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఎన్నో అవార్డులు పొందిన వీలర్‌ తన 97వ ఏట 2008లో మరణించారు. వీలర్‌ ఆత్మకథ 'ఎట్‌ హోమ్‌ ఇన్‌ ద యూనివర్స్‌' అందరూ చదవదగిన గ్రంథం.

మూలాలు

[మార్చు]
  1. "John Archibald Wheeler | Biography & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-04-22.
  2. ఈ.వి. సుబ్బారావు (courtesy : Eenadu telugu daily)

వెలుపలి లంకెలు

[మార్చు]