Jump to content

విందా కరందీకర్

వికీపీడియా నుండి
02:00, 13 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు. రచయిత: ChaduvariAWBNew (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
గోవింద వినాయక్ కరందీకర్
విందా కరందీకర్
జననం(1918-08-23)1918 ఆగస్టు 23
ధాల్‌వల్, సింధుదుర్గ్ జిల్లా, మహారాష్ట్ర
మరణం2010 మార్చి 14(2010-03-14) (వయసు 91)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ.
వృత్తిఆంగ్ల ఉపన్యాసకుడు
జీవిత భాగస్వామియేసూ గోఖలే,
సుమ
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం
కబీర్ సమ్మాన్

విందా కరందీకర్‌ ప్రముఖ మరాఠీ సాహిత్యకారుడు, కవి, మేధావి, విమర్శకుడు, బాలసాహిత్య రచయిత. 2003వ సంవత్సరంలో ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇతని అసలు పేరు గోవింద వినాయక్ కరందీకర్. ఇతడు గద్యరచనల్లోనూ, సామాన్య జీవిత కార్యకలాపాల్లోనూ అసలు పేరును, కవిత్వ రచనలలో విందా కరందీకర్ అనే పేరును వాడేవాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

జననం, బాల్యం

[మార్చు]

ఇతడు 1918, ఆగష్టు 23వ తేదీన మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంత్రపు సింధుదుర్గ్ జిల్లాలోని ధాల్‌వల్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నిరుపేద రైతు. అయితే అతడు విద్యాధికుడు. వీర సావర్కర్ ప్రభావంతో సంస్కర్తగా మారి తన ఊళ్ళో సాంఘిక దురాచారాలను తొలగించడానికి నిరంతరం కృషి చేసేవాడు.[1]

విద్య, ఉద్యోగం

[మార్చు]

విందాకు చదువు పట్ల అభిరుచి ఉండడం తండ్రి గమనించి ఇతడిని కార్లే అనే పల్లెటూరిలో ఉన్న దూరపు బంధువు వద్దకు పంపించాడు. అక్కడి నుండి విఠోబా అనే ఆయన కొల్హాపూర్‌కు తీసుకు వెళ్లి అక్కడ సాఠే అనే మాస్టరు ఇంటిలో ఇతనికి ఆశ్రయం కల్పించి వారాలు ఏర్పాటు చేశాడు. విందా సాఠే పనిచేసే పాఠశాలలో 1932లో చేరాడు. అక్కడ ఇతనికి సంస్కృత ఉపాధ్యాయుడు నగేశ్, సహధ్యాయి దేవధర్‌లు కవిత్వం పట్ల ఆసక్తిని కలిగించారు. ఇతని మొదటి కవితను అచ్చువేసిన ఘనత ఈ పాఠశాల పత్రికకే దక్కింది. తరువాత ఇతడు కొల్హాపూర్‌లోని రాజారామ్‌ కాలేజీలో చదివాడు. అక్కడ ఇతడిని ఫారసీ మాష్టారు మాధవ జులియన్, మురళీధర్ అనే మిత్రుడు ప్రభావితం చేశారు. మరాఠీ భాషపట్ల సంపూర్ణమైన ప్రేమ ఉన్నా ఇతడు ఇంగ్లీషు బాగా అధ్యయనం చేశాడు. కుటుంబ బాధ్యత కారణంగా ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇంగ్లీషులో డిగ్రీ సంపాదించాలని అనుకున్నాడు. 1939లో ఇతడు బి.ఎ. పరీక్ష వ్రాశాడు. పరీక్షా ఫలితాలు రాక ముందే ఇతడు నిజాం దుష్టపరిపాలను వ్యతిరేకంగా జరిగిన హైదరాబాదు ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యి పదకొండు నెలల కఠిన జైలుశిక్ష అనుభవించాడు. దానితో ఇతనికి రావలసిన ట్యూటరు ఉద్యోగం మరొక వ్యక్తికి లభించింది. తరువాత ఇతడు ఎం.ఎ. పరీక్షకు చదువుతూ ఉండగా సైకిలు ప్రమాదంలో చెయ్యి విరిగి మిరజ్ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ జరిగింది. కొంతకాలం తర్వాత ఇతడు తాజ్‌గావ్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఇతనికి గోరే మాస్టర్‌తో పరిచయం కలిగింది. అతని సూచనవల్ల వినోబా భావే, మహాత్మా గాంధీల సాహిత్యం చదివాడు. రాహుల్ సాంకృత్యాయన్ వ్రాసిన "వోల్గా నుండి గంగా వరకు", రష్యన్ విప్లవ రచయిత ప్రిన్స్ క్రొపాట్కిన్ వ్రాసిన "భోజన సమస్య" అనే గ్రంథాలను గోరే మాస్టర్ ప్రోద్బలంతో చదివాడు. అతని ప్రేరణతో విందా కరందీకర్ స్వయంగా చరఖా తిప్పి వడికిన నూలుతో తయారైన బట్టలే ధరించేవాడు. ఇతడు 1946లో ఎం.ఎ.పరీక్ష ఉత్తీర్డుడయ్యాడు. తర్వాత కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఉన్న బసవేశ్వర కాలేజీలో ఇంగ్లీషు ఉపన్యాసకుడిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ శ్రీనివాస అయ్యంగార్ ప్రేరణతో సోషియల్ వెల్ఫేర్ అనే ఆంగ్ల పత్రికకు ఎన్నో వ్యాసాలు, కవితలు వ్రాశాడు. ఇతడు మహారాష్ట్రలోని మంచి పేరున్న అనేక కాలేజీలలో ఇంగ్లీషు బోధించాడు. ఇతడు చికాగో, రష్యాలలో పర్యటించాడు[1].

కుటుంబం

[మార్చు]

ఇతడు తన అమ్మ తరఫు దూరపు బంధువు "యేసూ గోఖలే"ను ప్రేమించి రిజిస్టరు వివాహం చేసుకున్నాడు. ఒక దళితురాలిని వివాహం చేసుకున్నందుకు ఇతడు సంఘ బహిష్కరణకు గురి అయ్యాడు. అయితే ఇలాంటి విషయాలను ఇతడు ఎన్నడూ లెక్కచేయలేదు. కొంత కాలానికే ఇతని భార్య చనిపోయింది. దానితో ఇతని మనసు విరిగి శాంతి కోసం రాత్రింబవళ్ళు సంగీతంలో మునిగిపోయాడు. 1947లో ఇతడు సుమ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. సుమ తండ్రి మంచి కవి. కవి పుత్రి, కవి పత్ని అయిన సుమకు సహజంగానే కవిత్వం యొక్క ప్రాధాన్యత తెలిసివచ్చింది. విందా వద్ద దాదాపు 100 మంచి కవితలు ఉండడం చూసి ఆమె తాను పొదుపు చేసి కూడబెట్టిన 500 రూపాయలతో 1949లో విందా మొట్టమొదటి కవితల పుస్తకం "స్వేదగంగ"ను ప్రచురించింది. దీని ద్వారా కరందీకర్ ప్రతిభ లోకానికి బహిర్గతమయ్యింది. వీరికి పుట్టిన పిల్లలు కూడా ఒకరిని మించి ఒకరు మేధావులుగా ఎదిగారు[1].

సాహిత్యం

[మార్చు]

ఇతడు పాఠశాలలో చదువుకునే రోజుల నుండే రచనలు చేయడం మొదలుపెట్టాడు. అతడి మొదటి రచన పాఠశాల మేగజైన్‌లో ప్రచురితమైంది. ఇతడిని ప్రభావితం చేసిన అనేక విషయాలలో సావర్కర్, ఆర్య సమాజం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వినోబా భావే, మహాత్మా గాంధీ, తుకారాం, జ్ఞానేశ్వర్, బెర్ట్రాండ్ రస్సెల్, అరిస్టాటిల్, రాబర్ట్ బ్రౌనింగ్, హాప్‌కిన్స్, టి.ఎస్‌. ఎలియట్‌, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్ మొదలుకొని అతని జీవితంలో పరిచితులైన నగేశ్, దేవధర్, మాధవ జులియన్, మురళీధర్, గోరే మాస్టర్, పండిత్ ముక్తిరాం, సాధుదాస్, శ్రీనివాస అయ్యంగార్, ఎ.కె.రామానుజం వంటి వారు ఉన్నారు. వీరి నుండి ఇతడు ఎంతో నేర్చుకున్నాడు. ఇది ఇతని సాహిత్య సృజనకు దోహదపడింది. ఇతడు స్వయంగా అరిస్టాటిల్ రచించిన సాహిత్య శాస్త్రాన్ని, షేక్స్‌పియర్ నాటకం 'కింగ్ లియర్‌'ని, గోథె వ్రాసిన 'ఫాఉస్ట్'లను మరాఠీ భాషలోనికి అనువదించాడు. ఇతడు స్వయంగా తన కవితలను ఇంగ్లీషులోనికి అనువదించుకున్నాడు. ఇంగ్లీషులో ఇతని కవితా సంపుటులు మూడు వెలువడ్డాయి. ఇతని కవితలలో యంత్రావతార్, త్రివేణి (దీర్ఘకవిత, తీ జనతా అమర్ ఆహే, అతతాయి అభంగ్ ముఖ్యమైనవి. ఇతని రచనలు మొత్తం 5 కవితా సంపుటాలు, 3 సంపాదిత రచనలు, 12 బాలసాహిత్య రచనలు, 2 వ్యాససంపుటాలు, ఒక విమర్శ గ్రంథంగా వెలువడ్డాయి[1].

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఇతడు తన 91వ యేట ముంబాయిలో 2010, మార్చి 14వ తేదీన మరణించాడు[2][3].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 జె.లక్ష్మిరెడ్డి (1 November 2008). "జ్ఞానమే మానవ జాతికి ముక్తిప్రదాత" (PDF). మిసిమి. 19 (11): 5–14. Retrieved 31 March 2018.
  2. Poet Vinda Karandikar, Jnanpith winner, dies at 92
  3. Marathi poet Vinda Karandikar passes away