దిద్దుబాటు
దిద్దుబాటు
“తలుపు! తలుపు!”
తలుపు తెరవఁబడలేదు. ఒక నిమిష మతఁడూరుకొనెను.
గదిలోని గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది.
“ఎంత ఆలస్యము చేస్తినీ; బుద్దీ గడ్డి తిన్నది. రేపటి నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటి నాచల్లా పోయి సానీదానీ పాట సరదాలో మనసు లగ్నమై పోయినది. ఒక్క పాట సరదాతో కుదరలేదు. మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతూంది. లేకుంటే, పోకిరీ మనిషి వలే పాట ముగిసిన దాకా కూర్చోవడమేమిటి? యేదోవక అవకాశము కలుగఁజేసుకొని దానితో నాలుగు మాటలు ఆడడపు ఆసక్తియేమి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి మరీ పాటకు వెళ్ళను. నిశ్చయం, నిశ్చయం........ గట్టిగా పీలిచితే కమలినీ లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగల్గితీనా చడి లేకుండ పక్కజేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును”.
గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్కబ్రీడరేను. “అరే యిదేమి!” అనుకొని, రెక్క మెల్లన తెరవ, నడవలో దీపము లేదు. అంగణము దాటి తన పడక గది తలుపు తీయ, నందును దీపము లేకుండెను. చడిలేక అడుగు వేయుచు మంచము దరికి పోయి కమలిని నిద్రించుచుండెనా, మేల్కొనీ యుండేనా యనీ కనుగొన యత్నించెను గానీ, యేర్పరింప లేడయ్యె, అంత జేబు నుండి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించెను. మంచముపైనీ కమలినీ కానరాలేదు. నిశ్చేష్టుడై చేతి నుండి అగ్గిపుల్ల నేలరాల్చెను. గదినీ, అతని మనస్సును కూడా చీకటి క్రమ్మెను. వెట్టిశంకలును అంతకు పెట్టి సమాధానములును మనసున పుట్టుచు గిట్టుచు వ్యాకులత కలుగజేసెను. బుద్దీ తక్కువకు తనయందో, కానరామికి కమలినీ యందో, యేర్పరింపరానీ కోపావేశమును, చీకాకును గలిగెను. నట్టి వాటికి వచ్చి నిలువ చుక్కల కాంతిని దాసి గాని దాసుఁడు గానీ కనపడలేదు. వారికి తగిన శిక్ష వురియేయని గోపాలరావు నిశ్చయించెను.
తిరిగి గది లోనికి పోయి దీపము వెలిగించి, గది నలుదెసల పరికించేను. కమలినీ కానరాలేదు. వీధి గుమ్మము జేరి, తలుపు తెరచి చూడ చుట్ట కాల్చుచు తలయెత్తి చుక్కల పరీక్షించుచున్న రాముఁడు వీధీ నడుమ కానవచ్చెను. పట్టరాని కోపముతో వానిని ఁజూచి గోపాలరావు “రామా! రా!” యని పిలచేను. రాముడు గతక్కుమనీ చుట్ట పారవైచి, “బాబు” అని డగ్గరెను.
“మీ అమ్మేదిరా?”
“మా యమ్మా! యింటున్నది బాబూ”.
“మీ అమ్మ కాదురా; బుద్ధిహీనుఁడా, నా భార్యా"
“అమ్మగారా? యెక్కడుంటారు బాబూ? పడుకున్నారు”
“యింట్లోనే లేదు”. .
రాముడి గుండెలో దిగులు ప్రవేశించెను. గుమ్మములో అడుగు పెట్టగానే రాముని వీపుపై వీశ గుద్దులు రెండు పడెను. “చంపేస్తిరి బాబూ” అని రాముఁడు నేల కూలఁబడెను.
గోపాలుఁడు సదయ హృదయుఁడు. అక్రమమాచరించితినను జ్ఞానము వెంటనే పొడమి ఆగ్రహావేశము దిగజారి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువువలే నాచరించితినని యనుకొనుచు గదిలోనికి తీసుకొని పోయేను.
కుర్చీ పయి కూచుని “రామా యేమాయెరా?” యని దైన్యముతో ననేను.
“యేటో మాయలా వుంది బాబూ”
“పుట్టింటికి వెళ్లియుండునా?”
“అంత వారు కారనా? బాబూ కోపగించితే చెప్పలేను గాని ఆడారు. చదువు నేరిస్తే యేటౌతదీ?”
“విద్య విలవ నీకేం తెలుసురా, రామా!” అని గోపాలరావు మోచేతులు బల్లపయినాని వానీ నడుమ తలయుంచీ యోచించుచుండ కమలినీ చేవ్రాత నొక యుత్తరము కానవచ్చేను. దానిని చదువసాగెను.
“అయ్యా !”
'ప్రియ', పోయి "అయ్యా!' కాడికి వచ్చేనా?”
“పెయ్య పోయిందా బాబూ”
“మూర్ఖుడా! వూరుకో!”
"అయ్యా! పదీ దీనములాయే. రాత్రులనింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకు బోవుచుంటి మంటిరి. లోకోపకారకరములగు నుద్యమముల నిదుర మాని చేయుచుంటిమంటిరి. మా చెలుల వలన నీజము నేర్చితిని. నేనింట నుండుటను గదా మీరు కల్లలు పలుకవలసి వచ్చే. నేను పుట్టింట నున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు అవకాశమును కలుగకుండును. మీచే దీన దీనమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుం డుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నే నీ రేయి కన్నవారింటికి జనియెద సంతసింపుఁడు. వేచ్చము గాక యేపాటి మిగిలియున్నను దయ నుంచుఁడు.”
ఉత్తరము ముగించి “నేను పశువును” అని గోపాలరావు అనెను.
“అదేటి బాబు ఆలా శలవిస్తారు?”
“శుద్ద పశువును!”
రాముఁడు అతి ప్రయత్నముచే నవ్వు ఆచుకొనెను.
“గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు, నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది”.
“యేటి చేసినారు బాబూ?”
“పుట్టింటికి వెళ్ళిపోయినది - గాని నీకు తెలియకుండా యెలా వెళ్ళిందిరా?”
రాముఁడు రెండడుగులు వెనుకకు నడిచీ “నాను తొంగున్నాను కావాల బాబూ - అలక చేస్తే చెప్పుచాలు గాని బాబు ఆడదాయి చెప్పకుండా పుట్టినారింటికి యేల్తానంటే లెంపలాయించి కూకోబెట్టాలి గాని, మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్తోరం పుట్టదా బాబూ?”
“ఓరి మూర్ఖుఁడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువ విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుఁడు పార్వతికి సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు వాఁడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్ళాము మొగునీకన్న దొడ్డదీ అన్నమాట. బోధపడ్డదా?”
“నాకేం బోధ కాదు బాబూ” రామునికి నవ్వు ఆచుకొనుట అసాధ్యమగుచుండెను.
“నీ కూతురు బడికి వెళ్ళుతున్నది గదా; విద్య విలవ నీకే బోధపడుతుంది. ఆ మాట అలా వుండనియ్యి కానీ, నువ్వో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి. నేను నాలుగు రోజుల దాకా వూరి నుంచీ కదలడముకు వీలు పడదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. వెళ్ళి కమలినీని తీసుకురా. కమలినితో యేమి జెప్పవలెనో తెలిసిందా?”
“యేటా? బాబూ! బాబు నా యీపు పగలేసినారు, రండమ్మా అంతాను”.
“దెబ్బల మాట మరచిపో, కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను తీసుకో. మరీ యేన్నడు ఆ వూసేత్తకు. కమలినితో గానీ తప్పిజారి అనఁబోయేవు సుమా”.
“అనను బాబూ”. “నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను”, బాగా వీను. “పంతులికి బుద్దీ వచ్చింది. యిక యెన్నడూ సానుల పాట వినరు. రాత్రులు యిల్లు కదలరు. యిదీ ఖరారు”. తెలిసిందా? మిమ్ములను గెడ్డము పట్టుకుని బతిమాలు కున్నానని చెప్పమన్నారు. దయదలచి ఆయన లోపములు బయలు పెట్టక రెండు మూడు రోజులలో వెళ్ళిపోయి రమ్మన్నారు. మీరులేని రోజో యుగముగా గడుపుతున్నారు. అని నిపుణతగా చెప్పు- తెలిసిందా?”
“తెలిసిందీ బాబూ!”
“యేమని చెబుతావో, నాతో వొక మాటలు చెప్పు”.
రాముఁడు తలగోకుకొనుచు “యేటా - యేటా - అదంతా నాకేం తెలదు బాబూ - నానంతాను. అమ్మా! నామాటినుకోండి - కాలం గడిపినోళ్లీ - ఆడోరు యెజిమాని చెప్పినట్టల్లా యిని పల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచు గుంతారు. మీ శైవులో మాట, పట్టంలోకి బంగారబొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి పంతులు మనుసు మనుసులో లేదు. ఆపై మీ సిత్తం. అంతాను.
“ఓరి వెధవా!” అని గోపాలరావు కోపముతో కుర్చీ నుండి లేచి నిలిచెను.
ఊసవలే రాముడు వేలి కెగసెను.
అంతట మంచము క్రింద నుండి అమృత నిష్యందీని యగు కలకల నగవును కరకంక ణముల హృద్యారావమును విననయ్యెను.
(ఆంధ్రభారతి 1910 ఫిబ్రవరి)
ఇతర మూల ప్రతులు
మార్చుThis work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.