పిల్లితేగ లేదా తోటతేగ లేదా పిచ్చుకతేగ (శాస్త్రీయనామము-ఎస్పారగస్ అఫీషినలిస్) అనేది ఒక వసంత ఋతువులో పండే ఆకుకూర,, ఎస్పారగస్ జన్యువుకు చెందిన ద్వైవాత్సరిక మొక్క (రెండేళ్లకన్నా ఎక్కువకాలం బ్రతికేది).

కోతకోసిన పిల్లితేగ కట్టలు

ఇదొకప్పుడు లిల్లీ కుటుంబంలోకి ఉల్లివెల్లుల్లి జాతులతోపాటు వర్గీకరించబడింది. కాని, లిలియాసియే కుటుంబము తర్వాతికాలంలో సవరింపబడి, ప్రస్తుతం ఉల్లిజాతి కూరలు అమరిల్లిడాసే కుటుంబంలో,, పిల్లితేగ ఎస్పారగసే కుటుంబంలో చేర్చబడ్డాయి. ఈ పిల్లితేగ ఐరోపా, పశ్చిమ-సమశీతోష్ణ ఆసియాఖండ ప్రాంతాలలో విస్తృతంగా సాగుచేయబడుతోంది.

జీవశాస్త్రం

మార్చు
 
బిరుసుగా మారకముందున్న పిల్లితేగ కాండం

పిల్లితేగ అనేది సాధారణంగా 100-150 సెం.మీ||లు (39-59 అంగుళాలు) పొడుగు పెరిగే ఒక పత్రహారిత, ద్వైవాత్సరిక మొక్క. ఇది లావైన కొమ్మలతో, అతిసన్నమైన ఆకులతో (నిజానికి ఆ ఆకులు 6-32 మి.మీ||లు పొడవుతో, 1 మి.మీ వెడల్పుతో సూదుల్లా ఉంటాయట) ఉంటుంది. దీని ఆకులు పదిహేనేసి కలిసిపోయి ఒక గులాబిపువ్వులా ముడుచుకొని ఉంటాయి. పిల్లితేగ పువ్వులు గుడిగంట ఆకారంలో, ఆకుపచ్చ-తెలుపు లేదా పసుపురంగులో 0.18-0.26 అంగుళాలు పొడవుగలిగి ఆరురేకులు ఒకదానితోనొకటి అతుక్కుపోయుంటాయి. అవి గుత్తికి రెండు-మూడుచొప్పున రెమ్మలకు పూస్తాయి. మగ-ఆడపూవులు వేర్వేరు మొక్కలకు పూస్తాయి, కాని ఒకే మొక్కకు మగ-ఆడపూవులు పూసిన సందర్భాలూ ఉన్నాయి. పిల్లితేగ పండ్లు చిన్నగా, ఎర్రని గింజల్లాగ 6-10 మి.మీ||ల అడ్డకోలత (డయామీటరు) కలిగి పండుతాయి. కానీ, అవి విషపూరితాలు.

చరిత్ర

మార్చు

పిల్లితేగను దానియొక్క సున్నితమైన రుచికి, మూత్ర/మలవిసర్జన వర్ధక గుణాలకు, కేవలం ఒక ఆకుకూరగానే గాక, ఆయుర్వేద ఔషధముగా కూడా వాడుతున్నారు. క్రీ.పూ3000నాటి ఈజిప్టు పురాతత్త్వ చిత్రాల ప్రకారం  పిల్లితేగను ఒక కానుకగా మరొకరికి సమర్పించేవారని తెలిసింది. పూర్వకాలం నుండి, దీనిని ఎక్కువగా సిరియాస్పెయిన్ దేశస్థులు తినేవారు. యవనులు (గ్రీకులు), రోమన్లు దీనిని సాగుకాలంలో పచ్చి-తాజా కూరగా వంటలలో వాడి, ఇది పెరగని చలికాలంలో దీనిని తినడానికి ఎండబెట్టి, పొడిగా దాచుకునేవారు. ప్రపంచపు పురాతన వంటల పుస్తకాలలో ఒకటైన "డ.రి. కోఖ్వినేరియా" అనే సా.శ. 3వ శతాబ్దపు పుస్తకంలో (మొట్టమొదటిగా) ఈ పిల్లితేగను వాడి వంటచేసే తయారీవిధానం రాయబడింది.

పూర్వం యవనుల చికిత్సకుడైన "గేలన్ " ఈ పిల్లితేగను ఒక ప్రయోజనకరమైన మూలికగా సా.శ. 2వ శతాబ్దంలో అభివర్ణించాడు. రోమన్ల శకం ముగిసిన పిమ్మట ఈ పిల్లితేగ కాస్త మధ్య-ఆసియా దేశాలకు పాకింది. "అల్-నఫ్-జావి" అనే అరబ్బు రచయిత పిల్లితేగ కామవాంఛను పెంచి, పురుషులలో వీర్యాన్ని వృద్ధిచేస్తుందని తన "సౌగంధికోపవనము" (ద పర్ఫ్యూముడ్ గార్డెన్) అనే పుస్తకంలో రాశాడు. భారతదేశపు కళింగప్రదేశస్థుడైన కళ్యాణమల్లుడు అనే శృంగారరస కవి "అనంగరంగమ్" అనే తన శృంగారపుస్తకంలో పిల్లితేగలోని భాస్వరిక గుణాలు (ఫాస్ఫరస్) అలసటను, ఆకలిలేమిని నయం చేయడంలో సహకరిస్తాయని రాశాడు. సా.శ.1469 వరకు పిల్లితేగ ఐరోపాలో కేవలం పరాస (ఫ్రెంచ్) నివాసాలు, ఆశ్రమాలలోనే సాగుచేయబడేది. ఆంగ్లదేశస్థులు (ఇంగ్లాండ్ వారు) దీనిని తినడం సా.శ. 1538లో ప్రారంభించగా, శార్మణ్యులు (జర్మన్లు) సా.శ. 1542లో తినడం ప్రారంభించారు.

పిల్లితేగలోని రుచికరమైన, సున్నితమైన భాగాలు దాని కొసలు. ఇది ఆధునిక ప్రపంచంలో సా.శ. 1850 నుండి అమెరికా సంయుక్తరాష్ట్రాల ద్వారా ప్రపంచమంతా వ్యాపించింది.

పోషక విలువలు

మార్చు

లేత పిల్లితేగలే తినడానికి యోగ్యమైనవి, ఒకసారి మొగ్గలు వేసాక, ఇంక కాండాలు బెరడుకట్టినట్టు గట్టిగా అయిపోతాయి.

పిల్లితేగలో దాదాపు 93 శాతం నీరే ఉంటుంది. ఇవి క్యాలరీలు, సోడియం పరంగా తక్కువశాతం కలిగివుంటాయి. ఇవి వైటమిను-బీ6, ఖటికం (క్యాల్షియం), మగ్నం (మెగ్నీషియం), తుత్తునాగం (జింక్)ల విలువలు బాగా కలిగుండి, పీచుపదార్థాలు, మాంసకృతులు, బీటా-కెరొటీన్, వైటమిను-సీ,ఈ,కేలు, థియామీను, రైబోఫ్లావిన్, రూటిన్, నియాసిన్, ఫోలికామ్లం, ఇనుము, భాస్వరం (ఫాస్ఫరస్), పటాసం (పొటాషియం), తామ్రం (కాపర్), మంగనం (మాంగనీస్), సెలీనియంతోపాటు వర్ణం (క్రోమియం) కలిగివుంటాయి. ఎమీనో-ఆమ్లమైన "ఎస్పారజీన్" పిల్లితేగ లాటిన్ నామమైన "అస్పారగుస్" నుండి వచ్చింది.

పిల్లితేగ కాండాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా సాధారణంగా ఆకలిని పెంచే ఆహారపదార్థంగా (యాపటైజర్) తింటారు. ఆసియాఖండపు వంటలలో పిల్లితేగ సాధారణంగా వేపుడుగా తినబడుతుంది.అమెరికాలోని చీనాదేశపు హోటళ్లలో ఇది కోడిమాంసం, రొయ్యలు లేదా గోమాంసంతోపాటు కలిపి వడ్డించబడుతుంది. ఒక్కోసారి పిల్లితేగను బొగ్గులకుంపటిపై లేదా చెక్కకుంపటిపై కాల్చి తింటారు. ఈ మధ్యకాలంలో దీనిని పచ్చిగానో ఆవిరికి పెట్టియో సలాడ్లలో కూడా తినడం ప్రసిద్ధికెక్కింది.

పిల్లితేగను ఊరబెట్టి కూడా తినవచ్చు. కొన్ని దుకాణాలు అలా ఊరిన పిల్లితేగలను జాడీలలో పెట్టి అమ్ముతాయి కూడా.

పిల్లితేగ కాండము యొక్క లావునుబట్టి దాని వయసు అంచనావేస్తారు. లావుపాటి కాండాలున్నపిల్లితేగలను ముదిరిన వాటిగా గుర్తిస్తారు. అటువంటివి తినడానికి కష్టంగానుంటాయి. ఒకొక్కసారి అలా ముదిరినవాటిని తొక్కతీసి తింటారు. అటువంటప్పుడు అవి త్వరగా ఉడుకుతాయి. పిల్లితేగకు ఒకవైపు చివరిభాగం మట్టితో ఉంటుంది కాబట్టి, నీటితో చక్కగా శుభ్రంచేసుకొని తినాలి.

పచ్చని పిల్లితేగలు ప్రపంచవ్యాప్తంగా తినబడతాయి. కాని కొన్ని దేశాలలో వీటి దిగుమతులు సంవత్సరం పొడవునా ఉండవు. అటువంటి దేశాలలో ఇవి అరుదుగా లేదా కాలానుగుణంగా తినబడతాయి. ఐరోపాలో పిల్లితేగలు బాగాపండే కాలం భోజనప్రియులకు పండుగకాలం! యూ.కేలో వీటి సాగుకాలం ఏప్రిల్ నెలనుండి మే మధ్యవరకు ఉంటుంది. ఇది దొరికేకాలం తక్కువ కాబట్టి దీని ధర కొంచెమెక్కువే ఉంటుంది.

తెలుపు పిల్లితేగ – వాయువ్య ఐరోపా , పశ్చిమాసియా

మార్చు
 
బంగాళదుంపలతోపాటు వడ్డించబడిన తెల్లపిల్లితేగ

పిల్లితేగ నెదర్లాండ్స్, స్పెయిన్, ఫ్రాన్స్, పోలాండ్, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలో బాగా ప్రశస్తిపొందినది. పైగా ఆయా దేశాలలో ఇది తెలుపురంగులో దొరుకుతుంది. దీనిని సాగుచేసేటప్పుడు కాండాన్ని పూర్తిగా మట్టితో కప్పివేస్తారు, సూర్యరశ్మి తగలకపోయేసరికి కిరణజన్యు సంయోగక్రియ (ఫోటోసింథసిస్) జరగక దీని కాండం పచ్చబడకుండా తెలుపురంగులోకి మారిపోతుంది.పచ్చపిల్లితేగతో పోలిస్తే, ఈ తెలుపు పిల్లితేగను పండించేచోట దానిని "తెల్లబంగారం" లేదా "ఏనుగు దంతం"గా పిలుస్తూ ఒక రాచకూరగా పరిగణిస్తారంట. తెలుపు పిల్లితేగ పచ్చపిల్లితేగకన్నా తక్కువ చేదుగా, ఎక్కువ సున్నితంగానుంటుంది గనుక, తెలుపు పిల్లితేగ యొక్క తాజాదనానికి ఎక్కువ విలువనిస్తారు.

కాలానుగుణంగా (సాధారణంగా ఏప్రిల్ నుండి జూన్ వరకు), పిల్లితేగలను హోటళ్ల మెన్యూలలో ప్రకటిస్తారు. పరాస (ఫ్రెంచ్) ఆహారశైలి ప్రకారం దీనిని నీటిలో ఉడికించి లేదా ఆవిరిపై ఉడికించి, కరగించిన వెన్న లేదా ఆలివ్ నూనె, పార్మెజాన్ చీజు లేదా మెయొనైజ్ తోపాటు వడ్డనచేస్తారు. 

 
పిల్లితేగ- వృక్షశాస్త్ర వివరణ- చిత్రపటం
 
న్యూయార్క్ నగరంలో అమ్మకానికి ఉన్న పిల్లితేగలు
తెలుపు పిల్లితేగల సాగు- హోకెంహీం, జర్మనీలో

పిల్లితేగ ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలో పండుతుంది గనుక, అది పెరిగే మట్టిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుంది గనుక, కలుపుమొక్కలు సాధారణంగా వీటి పరిసరాలలో పెరగవు. కాని ఎందుకైనా మంచిదని వీటిమొదళ్లలో కలుపుమొక్కలను చంపడానికి ఉప్పుజల్లుతారు.దీనితో వచ్చే ప్రతికూల పరిస్థితి ఏమిటంటే, ఆ మట్టి ఇకపై వేరే మొక్కలను పెంచడానికి పనికిరాదు. మునుపటి సాగులోని పిల్లితేగల కాండాలను కొన్నింటిని దాచి, వాటిని మరలా శీతాకాలంలో పాతుతారు. వసంతఋతువు వచ్చేసరికి, మొదటి మొలకలు వస్తాయి. వాటిని "స్ప్రూ" అంటారు.

సాగుకాలం కన్నా ముందే పండించగలిగే కొత్తరకం పిల్లితేగలను, యూ.కే దేశశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ రకం పిల్లితేగలు, సాధారణ రకంలా 9 °C వాతావరణంలోగాక 7 °C వాతావరణంలోనే పుష్పిస్తాయట. 

నేరేడురంగు పిల్లితేగలు పచ్చ-తెలుపు పిల్లితేగలకంటే ఎక్కువ శాతం తియ్యదనం, తక్కువశాతం పీచుపదార్థాలను కలిగివుంటాయి.నేరేడురంగు పిల్లితేగలు ప్రప్రథమంగా ఇటలీదేశంలోని అల్బెంజా నగరంలో వృద్ధిచేయబద్డాయి. అవి మెల్లగా అమెరికా, న్యూజిలాండ్ దేశాలకు వ్యాప్తిచెందాయి.

తోటిపంటలు

మార్చు

పిల్లితేగలు సాధారణంగా టమాటాలతోపాటు కలిసి పెంచబడతాయి. ఎందుకంటే టమాటాలు పిల్లితేగలపై దాడిచేసే పురుగులను నిరోధించగా, పిల్లితేగలు టమాటాలపై దాడిచేసే సరీసృపాలను నిరోధిస్తాయి.

వాణిజ్యోత్పత్తి

మార్చు
 
2005లో పిల్లితేగల సాగుసంఖ్య (శాతంలో) - అధికంగా చీనా దేశం
  100
  10
  1

2013లో అత్యధిక పిల్లితేగ దిగుమతిదారులు- అమెరికా ఐక్యరాష్ట్రాలు (1,82,805 టన్నులు), తర్వాత ఐరోపా కూటమి (యూ.కే) (94,475 టన్నులు), ఆపై కెనడా (20,219 టన్నులు)

ఇప్పటివరకు చీనాదేశం ప్రపంచంలో అత్యధికంగా పిల్లితేగలను ఉత్పత్తిచేసేదిగా నిలిచింది. 2013లో ఆ దేశం డెబ్భైలక్షల టన్నులను ఉత్పత్తి చేయగా, రెండవస్థానంలో పెరూదేశం 3,83,144 టన్నులను, మూడవస్థానంలో మెక్సికో 1,26,421 టన్నులను ఉత్పత్తిచేశాయి. అమెరికా ఐక్యరాష్ట్రాలలో కాలిఫోర్నియా, మిషిగన్, వాషింగ్టన్ ప్రాంతాలలో ఎక్కువగా పిల్లితేగ ఉత్పత్తి ఉండగా, తెలుపు పిల్లితేగల వార్షికోత్పత్తిలో జర్మనీ 57,000 టన్నులతో ప్రథమస్థానంలో ఉంది.

మూత్ర-మలవర్ధక ప్రభావాలు

మార్చు

పిల్లితేగలను తినడం వలన మలమూత్రాలపై పడే ప్రభావాలు:

"పిల్లితేగ ఒక శక్తివంతమైన , అనంగీకారమైన వాసనను మూత్రమునకు కలిగించును. ఈ విషయమందరికీ తెలుసు!"

— ఆహారం యొక్క అన్ని రకాల చికిత్సాగ్రంథము, లూయీ లెమెరి, సా.శ. 1702[1]

పిల్లితేగ… మనిషి మూత్రానికి ఒక రకమైన బురదవాసనను ఇస్తుంది గనుక కొందరు వైద్యులు ఇది మూత్రపిండాలకు మంచిదికాదని భావిస్తున్నారు. ఎందుకంటే మూత్రపిండాలు అప్పుడు (పిల్లితేగలను ఎక్కువగా తినడం వల్ల) వయసుపెరిగే కొద్ది పనిచేయడం తగ్గించివేస్తాయని వైద్యుల అభిప్రాయం.

— "వ్యాధుల లక్షణాలపై ఒక వ్యాసము", జాన్ ఆర్బుథ్నాట్, సా.శ. 1735[2]

కొన్ని పిల్లితేగల కొమ్మలు తిన్నా సరే, మీ మూత్రము బురదవాసన వచ్చేస్తుంది...

— "బ్రసెల్స్ రాచ విద్వత్సభకు లేఖ", బెంజమిన్ ఫ్రాంక్లిన్, సా.శ. 1781[3]

పిల్లితేగ నా కడుపును కుళ్లుకాలువగా మార్చుతుంది."

— మార్సెల్ ప్రౌస్ట్ (1871–1922)[4]

పిల్లితేగ–రసాయనాలు

మార్చు
 
పిల్లితేగ ఆకులు శిశిరంలో బంగారురంగులోకి మారుతాయి

పిల్లితేగలోని కొన్ని రసాయనిక పదార్థాలు కడుపులో అరిగాక అమోనియా, గంధక పదార్థాలుగా రూపాంతరం చెంది థియాల్స్, థియోఎస్టర్స్ అనే వాటిని సృష్టిస్తాయి. వాటి కారణంగా మూత్రానికా వాసన వస్తుంది.

పిల్లితేగ తిన్నవెంటనే మూత్రముపై దాని ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం కనుమరుగవ్వడానికి చాలాసేపు పడుతుంది.పిల్లితేగ  తిన్న పదిహేను-ఇరవై నిమిషాలకు మూత్రము చెడ్డవాసన రావడం ప్రారంభిస్తుంది. దాదాపు ఆ తర్వాత 4-5 గంటలు పాటు వచ్చే మూత్రము దుర్గంధభరితమై ఉంటుంది.

చిత్రజాలం

మార్చు
  1. McGee, Harold (2004). "6". McGee on Food and Cooking. Hodder and Stoughton. pp. 315. ISBN 0-340-83149-9.
  2. Arbuthnot J (1735). An Essay Concerning the Nature of Aliments 3rd ed. London: J. Tonson. pp. 64261–262.
  3. Franklin, Benjamin (c. 1781). "Letter to the Royal Academy of Brussels".[permanent dead link][permanent dead link]
  4. From the French "[...] changer mon pot de chambre en un vase de parfum", Du côté de chez Swann, Gallimard, 1988.