ముక్కామల అమరేశ్వరరావు
ముక్కామల అమరేశ్వరరావు | |
---|---|
జననం | జూన్ 27, 1917 |
మరణం | 1991 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, వైద్యుడు |
తల్లిదండ్రులు | సీతారావమ్మ, ముక్కామల సుబ్బారావు |
బంధువులు | ముక్కామల కృష్ణమూర్తి |
ముక్కామల అమరేశ్వరరావు ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక సంస్థ నిర్వాహకుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1917, జూన్ 27వ తేదీన భద్రాచలం సమీపంలో వున్న చోడవరం గ్రామంలో సీతారామమ్మ, సుబ్బారావు దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ముక్కామల సుబ్బారావు కూడా ప్రముఖ నటుడు. ఇతని తమ్ముడు ముక్కామల కృష్ణమూర్తి ప్రముఖ సినీనటుడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం సత్తెనపల్లి, అవనిగడ్డ, జగ్గయ్యపేట, తాడిపత్రిలలో జరిగింది. ఆ తరువాత గుంటూరు ఎ.సి.కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆ తరువాత 1941లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్.పట్టా పొందాడు. 1958 వరకు గుంటూరు గవర్నమెంటు ఆసుపత్రిలో స్పెషలిస్టుగా సేవలందించాడు. గుంటూరులోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతని వద్ద వైద్యసేవలనందుకుని స్వస్థత పొందిన ప్రముఖులలో అద్దంకి శ్రీరామమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, నండూరి సుబ్బారావు, తురగా పుండరీకాక్షుడు, మందపాటి రామలింగేశ్వరరావు మొదలైన వారు ఉన్నారు.
నాటకరంగం
[మార్చు]ఇతనికి చదుకునే రోజుల నుండే నాటకాలలో నటించడానికి ఆసక్తి ఉండేది. తాడిపత్రిలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాటకపోటీలలో ప్రథమ బహుమతి బళ్ళారి రాఘవ చేతుల మీదుగా అందుకున్నాడు. ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు గాలిపెంచల నరసింహారావు వద్ద సంగీతం అభ్యసించాడు. విఖ్యాత హార్మోనియం సంగీత విద్వాంసుడు ఆకుల నరసింహారావు వద్ద నాటకరంగ మెలకువలు నేర్చుకున్నాడు. ఇతడు శ్రీకృష్ణరాయబారంలో కృష్ణునిగా, రామదాసులో కబీరుగా, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రునిగా నటించి ఆయా పాత్రలకు జీవం పోశాడు. 1943లో గుంటూరులో నవజ్యోతి ఆర్ట్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి దానిద్వారా ప్రతాపరుద్రీయం వంటి అనేక చారిత్రక, పౌరాణిక నాటకాలకు దర్శకత్వం వహించి, నటించి మద్రాసు, హైదరబాదు, వివిధ ప్రముఖ తెలుగు నగరాలలో అనేక ప్రదర్శనలు కావించి మంచి పేరు తెచ్చుకున్నాడు. చిత్తూరు నాగయ్య, కె.వి.రెడ్డి వంటి ప్రముఖులు ఇతని కృషిని కొనియాడారు.
మరణం
[మార్చు]ఇతడు 1991, అక్టోబర్ 19వ తేదీన మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ అయ్యదేవర, పురుషోత్తమరావు (1 July 2017). "ప్రతాపరుద్రుని పాత్రకు జీవం పోసిన డాక్టర్ ముక్కామల అమరేశ్వరరావు". సాహితీకిరణం. 9 (5): 33.