Jump to content

వికీపీడియా:శైలి/సినిమా వ్యాసం

వికీపీడియా నుండి

ఈ కింది మార్గదర్శకాలు శైలి కోసం ఉపయోగపడతాయి. ఈ మార్గదర్శక సూత్రాల్లో చాలావరకూ కొన్ని సినమాల గురించో, సినిమా వ్యక్తుల గురించో కాకుండా ప్రత్యేకించి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కో వ్యాసం రాయాలని భావించినప్పుడు ఉపకరిస్తాయి. సాధారణంగా సినిమాల గురించిన వ్యాసాలన్నిటి నుంచీ ప్రాథమిక సమాచారంలోని శీర్షికలు ఉండాలని ఆశించవచ్చు. ఐతే ప్రత్యేక సమాచారం కింద ఉన్న శీర్షికల్లో ఒక్కో శీర్షికా కొన్ని సినిమాలకే ఉంటాయి. ఈ శీర్షికలు ఏ వరుసలో ఉండాలన్న దానిపై నిర్దిష్టమైన వరుస అంటూ ఏమీ లేదు. ఈ పేజీలోని సమాచారం మార్గదర్శకాలకు సంబంధించింది కనుక మార్పుచేర్పులు వికీపీడియా పాలసీలు, పాల్గొనే సభ్యుల ఏకాభిప్రాయాలను అనుసరిస్తూంటాయి.

పేర్లు పెట్టే విధానం

  • అప్పటికే సినిమా పేరుతోనే సినిమాలకు సంబంధంలేని వేరే వ్యాసం ఏదైనా ఉంటే అయోమయ నివృత్తి పేజీ సృష్టించి శీర్షికలో (సినిమా) అన్నది చేర్చి తయారుచేయండి: "సినిమా పేరు (సినిమా)"
  • అప్పటికే మీరు సృష్టించదలుచుకున్న పేరుతో వేరే సినిమా ఉంటే మీరు సృష్టించే వ్యాసంలో (సంవత్సరం సినిమా) టైటిల్లో ఉపయోగించండి: "సినిమా పేరు (సంవత్సరం సినిమా)". అలాగే

ఒకవేళ సినిమా టైటిలే సందేహాస్పదమైతే, అంటే సినిమా టైటిల్లో ఫలానా పదం ఉందనీ లేదనీ, వగైరా దాన్ని ఇలా పరిష్కరించాలి:

  • ఆంగ్లో-అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ 7.0బి1 ప్రకారం: సినిమాలు, వీడియో రికార్డింగులకు ప్రధానమైన సమాచార మూలం వరుసలో: సినిమా (ఉదా: టైటిల్ ఫ్రేములు), సినిమా కంటెయినర్ కూడా సినిమాలో అవిభాజ్య భాగం అయితే (ఉదాహరణకు క్యాసెట్, సీడీ కవర్)"(Basic Videorecordings - OLAC)
  • ఇతర భాషల సినిమాల విషయంలో ఒకవేళ ఆ సినిమా తెలుగులో విడుదల కావడం జరిగి ఉంటే వ్యాసానికి ఆ డబ్బింగ్ పేరు పెట్టి, వ్యాసం అంతా డబ్బింగ్ అయిన తెలుగు పేరు ఉపయోగించాలి, ఐతే పరిచయం విభాగంలో బ్రాకెట్లలో, బొద్దు అక్షరాల్లో ఆ మూల భాషలోని టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు తమిళ చిత్రమైన ఇండియన్ తెలుగులో భారతీయుడుగా డబ్బింగ్ అయినందున వ్యాసంలోని పరిచయం విభాగం ప్రారంభం అవుతూనే భారతీయుడు (తమిళంలో ఇండియన్) అని ప్రారంభించి, వ్యాసం అంతా భారతీయుడు అని వ్యవహరించవచ్చు.
    • సినిమా తెలుగులో డబ్బింగ్ అవ్వడం కానీ, మూలభాషలోని పేరుతోనే ప్రాచుర్యం కావడం కానీ జరిగి ఉంటే మూలభాషలోని పేరుతోనే వ్యాసం ఉండాలి. ఉదాహరణకు ఇన్సెప్షన్ సినిమా తెలుగులో ఆరంభంగా డబ్బింగ్ అయినా తెలుగు సినిమా పత్రికలు, విశ్లేషణలు మొదలుకొని తెలుగువారందరికీ ఇన్సెప్షన్ అనే ప్రాచుర్యం చెందింది కాబట్టి ఇన్సెప్షన్ అన్న పేరును ఉంచేలా నిర్ణయించవచ్చు, అలానే వ్యాసం అంతా అదే పేరును కొనసాగిస్తూ డబ్బింగ్ సినిమా వివరాలు ఇవ్వాలి.
    • తెలుగులోకి డబ్బింగ్ కాని సినిమాల విషయంలో నేరుగా ఆయా భాషల టైటిల్స్ తోనే అంతటా వ్యవహరిస్తూ వ్యాస పరిచయంలో బ్రాకెట్లతో తెలుగులో పదానికి అనువాదం ఇవ్వాల్సివుంటుంది.

ప్రాథమిక సమాచారం

వ్యాసం ఈ కింది అంశాలను కవర్ చేసేందుకు ప్రయత్నించాలి. అనేక సినిమాల నిర్మాణం, విడుదల వంటివి వేర్వేరుగా ఉండడంతో ఒక్క వ్యాస పరిచయం తప్పించి శీర్షికల నిర్మాణం, ఏ వరుసలో రావాలి వంటివి వాడుకరి విచక్షణను అనుసరించి నిర్ణయించవచ్చు, వ్యాసం అవసరాన్ని అనుసరించి ఉత్తమమైన వరుసలో పెట్టాలి.

పరిచయం విభాగం

వ్యాస పరిచయం విభాగం సినిమాను పరిచయం చేసి, మిగిలిన వ్యాసం నుంచి సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాల సారాంశం అందించాలి. కనీసం, ప్రారంభ వాక్యం ఈ అంశాలను తెలియజేయాలి: సినిమా పేరు, విడుదలైన సంవత్సరం, సినిమా విభాగం, ఉప విభాగం, ఇతర అనువర్తించే అంశాలు కూడా ఉండాలి (ఉదాహరణకు ప్రాముఖ్యత కలిగిన దర్శకుడు కానీ, నిర్మాత కానీ) విభాగం వర్గీకరణ (జాన్రా) అన్నది ప్రాధాన్యతను అనుసరించి, ప్రధాన స్రవంతిలోని నమ్మదగ్గ మూలాల్లో నిర్ధారించిన విధంగా ఉండాలి. విదేశీ, పరభాషా చిత్రాల పేర్లు విషయంలో చేయాల్సిన విధానాలను సినిమా వ్యాసంలో పేర్లు పెట్టే విధానాన్ని అనుసరించి ఉండాలి. సినిమా ఏ దేశానికి చెందిందని నిర్ధారించదగ్గ మూలాల ద్వారా నిర్ణయించగలిగితే (ఉదాహరణకు అమెరికన్ చలనచిత్రం, బ్రిటీష్ చలన చిత్రం) ప్రారంభ వాక్యంలోనే ప్రస్తావించాలి. భారతీయ చిత్రాల విషయంలో మూల భాషను ప్రస్తావిస్తే సరిపోతుంది, బహుభాషా చిత్రాలైతే ప్రారంభ వాక్యంలో రెండు భాషల పేర్లు ప్రస్తావించాలి. పరిచయంలోని మొదటి పేరాలో దర్శకుడు, ప్రధాన తారాగణం పేర్లు తెలపాలి. రచయితలు కానీ, నిర్మాతలు కానీ పేరున్నవారైతే వారి పేరు కూడా తొలి పారాగ్రాఫ్ లో తెలియజేయవచ్చు. సినిమా ఏదైనా మూలం (నాటకం కానీ, నవల కానీ, ఇతర సాహిత్య ప్రక్రియలు కానీ, మరో సినిమా కానీ కావచ్చు) ఆధారం చేసుకుని తీసివుంటే ఆ మూలం పేరు కూడా తెలియజేయాలి. వీలైతే సినిమాలోని మౌలిక కథాంశాన్ని, ముఖ్యాంశాలను, నటుల పాత్రలను అత్యంత క్లుప్తంగా వివరించొచ్చు.

పరిచయ విభాగంలో తర్వాత వచ్చే పేరాలు మొదటి లైనులో ప్రస్తావించనివీ, తర్వాత వచ్చే మిగతా వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా వివరించాలి. వీటిలో సినిమాకు సంబంధించి నిర్మాణం, ప్రధానమైన థీమ్స్, సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల స్పందన, వివాదాలు, అవార్డులు, గౌరవాలు, అనుబంధ సృజనలు, ప్రాజెక్టులు (సీక్వెల్స్, రీమేకులు, సంబంధిత మీడియా), సమాజంపై సినిమా చూపిన ఏదైనా గమనించదగ్గ ప్రభావం వంటి ప్రధానమైన ఘటనలు, మైలురాళ్ళ వంటి సమాచారం ఉండాలి. తటస్థ దృక్కోణం అనుసరించి గొప్ప, అద్భుతమైన, అవార్డులు పొందిన, ప్రఖ్యాత, మొదలైన పదాలు మొదటి వాక్యాల్లో పరిహరించాలి, ఐతే తర్వాతి పేరాల్లో మాత్రం నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన విధంగా వచ్చిన అవార్డుల గురించి క్రోడీకరించి రాయాలి.

కథాంశం

సినిమా వ్యాసాలకు సినిమాలే ప్రాథమిక మూలం కనుక సినిమా కథ గురించి మౌలికమైన వివరణతో రాస్తే, అది బయటి మూలాలతో పనిలేకుండా అంగీకరించవచ్చు. ప్రాథమిక మూలాల గురించి వికీపీడియా పాలసీలు ఇలా ఉన్నాయి[1] - "..ప్రాథమిక మూలం నుంచి కేవలం మౌలికమైన వివరణతో రాయాలి. దాని ఖచ్చితత్వాన్ని సామాన్యమైన విద్యావంతుడైన వ్యక్తి ప్రత్యేకించిన లోతైన విజ్ఞానం లేకుండా పరిశీలించుకుని ధ్రువీకరించుకునేంత మౌలికమైన వివరణే రాయాలి. ప్రాథమిక మూలం నుంచి లభిస్తున్న సమాచారం గురించి విశ్లేషణాత్మకంగా కానీ, సమన్వయం చేసి కానీ, వ్యాఖ్యానించుకుని కానీ, వివరణాత్మకంగా కానీ, మూల్యాంకనం చేసి కానీ రాయకూడదు."

  1. ఇంగ్లీష్ వికీపీడియా పాలసీ నుంచి అనువదితం